శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:56 IST)

కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏడుగురు స్మగ్లర్లు అరెస్ట్‌

కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మోస్ట్‌ వాటెండ్‌ స్మగ్లర్లతోపాటు ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 1.6 టన్నుల బరువు కలిగిన 55 ఎర్రచందనం దుంగలు, కారు, పికప్‌ వాహనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అన్బురాజన్‌ వివరాలను వెల్లడించారు. ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ... ప్రధాన స్మగ్లర్‌ గుజ్జల శ్రీనివాసుల రెడ్డి పై గతంలో పిడి యాక్ట్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలోని 8 కేసుల్లో, కడప జిల్లాలో 9 కేసుల్లో శ్రీనివాసుల రెడ్డి ముద్దాయి. పేరుమోసిన స్మగ్లర్‌ సంజరు తో శ్రీనివాసులరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. మరో స్మగ్లర్‌ రెడ్డప్ప రెడ్డి 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు.

పరారీలో ఉన్న తమిళనాడు, చిత్తూరు, కడప జిల్లా లకు చెందిన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. స్మగ్లర్లను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

స్మగ్లర్ల అరెస్ట్‌ విషయంలో కీలకంగా వ్యవహరించిన ఎఎస్పీ దేవప్రసాద్‌, డిఎస్పీ వాసుదేవన్‌, సిఐ లింగప్ప, ఎస్సై భక్తవత్సలంను ఎస్పీ అన్బు రాజన్‌ ప్రశంసించారు.