గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాదం ... సూత్రధారులను గుర్తిస్తాం : జిల్లా ఎస్పీ

fire accident
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తిస్తామని, ఆ దిశగానే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఘటనలో 25 అంశాలకు చెందిన రెవెన్యూ పత్రాలు దగ్ధమయ్యాయని తెలిపారు. పాక్షికంగా కాలిన 700 పత్రాలను రికవరీ చేయగలిగామన్నారు. 
 
నిపుణులను పిలిపించి సంఘటన స్థలం నుంచి నమూనాలు సేకరించామని ఎస్పీ విద్యాసాగర్ వివరించారు. నిపుణుల నివేదికలు వచ్చాక మరిన్ని ఆధారాలు బయటికి వస్తాయని అన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో అధికారులు, ఇతరుల పాత్రపైనా విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. కాగా, కార్యాలయంలో ఘటన జరగడానికి ముందే అక్కడ ఇంజిన్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఈ వ్యవహారంలో 35 మంది అనుమానితులను గుర్తించి విచారిస్తున్నామని తెలిపారు.
 
ఈ ఘటనలో అసలు కుట్రదారులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారని, అనుమానితుల ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ రికార్డుల పరిశీలన జరుగుతోందని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు.