గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (10:58 IST)

గులకరాయి కథ కంచికేనా... 9 రోజులైన పురోగతి లేదు!!

Jagan
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగి తొమ్మిది రోజులు గడిచిపోయింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటిపురోగతి సాధించలేకపోయారు. ఈ కేసులోని వాస్తవాలను ఛేదించేందుకు పోలీసులు ఏకంగా ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయారు. పైగా, ఈ గులకరాయి దాడి ఘటనకు సంబంధించి ఏదేని ఆధారమిచ్చేవారికి రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
 
అయితే, టీడీపీ నాయకుడు దుర్గారావును నాలుగు రోజులపాటు అదుపులో ఉంచుకుని ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు లభ్యం కాలేదు. ఇప్పటివరకు ఏ1 సంగతి మాత్రమే పోలీసులు తేల్చారు. మరి మిగిలిన నిందితులు ఎవరు.. వారి పాత్ర ఏమిటి? అనే అంశాలను వెలికి తీయలేకపోయారు. ఈ కేసులో తొలుత అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో సతీషన్‌ను నిందితుడిగా తేల్చి ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 సతీష్ ఏ2 ప్రోద్బలంతో.. జగన్‌పై రాయి విసిరాడని పేర్కొన్నారు. 
 
సతీష్ వాంగ్మూలం ఆధారంగా దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ వేర్వేరుగానూ, కలిపి కూడా విచారించినా ఎటువంటి ఆధారం దొరకలేదు. కేవలం సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగానే పోలీసులు ఈ కేసును నడిపిస్తున్నారే తప్ప సాక్ష్యాల సేకరణలో పురోగతి లోపించింది. ఫలితంగానే దుర్గారావును విడిచిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పాటు నాలుగు రోజులపాటు తమ కస్టడీలో ఉంచుకోవడం.. ఆయన కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సన్నద్ధం అవుతుండడం వల్ల ఆయనను విడిచిపెట్టాల్సి వచ్చినట్లు భావిస్తున్నారు.
 
ఈ కేసులో ఏ2గా దుర్గారావును చేరుస్తున్నట్లు లీకులిచ్చి.. చివరకు ఆధారాలు దొరక్క వదిలేశారు. మరి ఈ కేసులో ఏ2గా ఎవరిని చేరుస్తారు? వారి పాత్రను ఎలా నిర్ధారిస్తారనేది తేలాల్సి ఉంది. తర్వాత ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తారు? తాము లక్ష్యంగా చేసుకున్న వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించగలరా.. అనేది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడమే ప్రధాన కారణం. దీనికి తోడు ఆధారాల సేకరణలో పోలీసుల వైఫల్యం మరో కారణం. 
 
ఈ ఘటనలో టీడీపీ నేతల పాత్రపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరిని ఇరికించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను జగన్‌పైకి రాయి విసిరానని ఒప్పుకొన్న సతీషను సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి వాంగ్మూలం నమోదు చేయించనున్నారు. అయితే వారి అదుపులో ఉన్న సమయంలో ఇచ్చిన నేర అంగీకార పత్రంలో చెప్పిన దానికి భిన్నంగా.. తనను బెదిరించి ఒప్పించారని అతడు చెబితే మాత్రం పోలీసులకు ఇబ్బందికరమే!