శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉసురు తీసిన మూఢభక్తి : మళ్ళీ బతుకుతారని కుమార్తెలను కొట్టి చంపేశారు.. ఎక్కడ?

హైటెక్ సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు ప్రజల్లో బలంగా నాటుకునివున్నాయి. ఈ మూఢనమ్మకాలతో పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా భార్యాభర్తల మూఢభక్తి కమార్తెల ఉసురు తీసింది. తమ కుమార్తెలు మళ్లీ బతుకుతారన్న మూఢనమ్మకంతో తల్లిదండ్రులో పాశవికంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లెలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా ఉన్నారు. ఆయన భార్య పద్మజ కూడా ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
 
పురుషోత్తం, పద్మజ దంపతులకు అలేఖ్య (27), సాయిదివ్య (22) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలేఖ్య భోపాల్‌లో పీజీ చేస్తుండగా, సాయిదివ్య బీబీఏ పూర్తిచేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. గతేడాది వీరు స్థానికంగా కట్టుకున్న సొంత ఇంటిలోకి మారారు.
 
అప్పటి నుంచి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్టు ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ఈ క్రమంలో గత రాత్రి కూడా పూజలు చేసిన పురుషోత్తం, పద్మజలు తొలుత సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోట్లో రాగిచెంబు పెట్టి డంబెల్‌తో తలపై మోది చంపేశారు. 
 
ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు కాలేజీలోని తనతోపాటు చనిచేసే ఓ ఉపాధ్యాయుడికి చెప్పడంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
దీనిపై మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న మూఢభక్తితోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు  ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. కుమార్తెలు ఇద్దరినీ తల్లే చంపిందన్నారు. ఆ సమయంలో తండ్రి అక్కడే ఉన్నారని చెప్పారు. పురుషోత్తం నాయుడు, పద్మజ ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.