శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (09:42 IST)

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం ... రెండో కుమారుడు కూడా మృతి

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరోమారు విషాదం చోటుచేసుకుంది. మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి అనుమానాస్పద స్థితిలో విగతజీవుడై కనిపించాడు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో రవీంద్రనాథ్ చౌదరి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
 
ఇటీవలే మాగంటి బాబు పెద్దకుమారుడు రాంజీ కన్నుమూశారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబం తల్లడిల్లిపోతోంది. రవీంద్రనాథ్ చౌదరి ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందగా, ఆసుపత్రి నుంచి మధ్యలోనే ఆయన వచ్చేసినట్టు సమాచారం. అప్పటినుంచి హైదరాబాద్‌లోని స్టార్ హోటల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.
 
కాగా, రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు చనిపోయాడన్న మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. 
 
ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబంలో రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వివరించారు.
 
మాగంటి బాబు పెద్ద కొడుకు రాంజీ మృతి చెందగా, ఇప్పుడు రెండో కొడుకు కూడా చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.
 
మాగంటి బాబు కుమారుడు రవీంద్ర మృతి బాధాకరమన్నారు. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మాగంటి బాబు ఇప్పటికే ఒక కుమారుడ్ని పొగొట్టుకుని పుత్రశోకంతో ఉన్నారని, ఇప్పుడు ఆయన మరో కొడుకును కూడా కోల్పోవడం చూసి గుండె బరువెక్కిందని అన్నారు.