గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (19:29 IST)

టీడీపీ బలోపేతానికే సంస్థాగత ఎన్నికలు: పులివర్తి నాని

తెలుగు దేశం పార్టీని బలోపేతం చేసేందుకై సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజక వర్గ ఇన్ చార్జ్ పులివర్తి నాని అన్నారు.

శనివారం చంద్రగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యత కల్పించే బాధ్యత తానుతీసుకుంటానని తెలుగు తమ్ముళ్ళకు హామీ ఇచ్చారు.

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే పదవులు వచ్చేలా రాష్ట్ర పార్టీ కార్యాలయ పెద్దలు అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళారు అన్నారు. ఇకపై ఎక్కడ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయని వారికి గుర్తింపు ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు.

అంతేకాక తెలుగు దేశం పార్టీలో ఉంటూ కో వర్టులుగా వ్వవహరించే వారిని గుర్తించి బయటకు పంపటం జరుగుతుంది అన్నారు. అన్నింటి కంటే ముందు పార్టీ సంస్థాగతంగా బాగుండాలి అంటే మంచి వ్యక్తులను అధ్యక్ష‌, కార్యదర్శులుగా ఎన్నుకోవాలని సూచించారు.

టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో ఎవ్వరి సిఫార్సులు పనిచేయవని కార్యకర్తల అభిప్రాయం మేరకు పదవులు వరిస్తాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే నాయకుడుగా ఎదిగే అవకాశం ఉంటుంది అన్నారు. గ్రామ ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని, ఈ సంస్థాగత ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు.

టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో బలమైన ప్రజాభిమానం కలిగిన వ్యక్తులను ఎన్నుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం మన సొంతం అవుతుంది అన్నారు. చివరగా చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన ఆరు మండలాలకు ఆరుగురు పరిశీలకులను నియమిస్తూన్నట్లు పులివర్తి నాని వెల్లడించారు.

అంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల పరిశీలకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం సంస్థాగత ఎన్నికల నిర్వహణ విధి, విధానాల గురించి చెప్పారు.