కారులో వెళుతుండగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనం
తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. కారులో వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీహదహనమయ్యాడు. చంద్రగిరి మండలంలోని నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆవ్యక్తి కారులోనే సజీహ దహనమైపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, మృతదేహా గుర్తుపట్టలేనిస్థితిలో ఉండటంతో కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజుగా గుర్తించారు.
బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వస్తుండగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. సజీవ దహనం చేయడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.