బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (19:39 IST)

ఆర్థికమంత్రిగా సీఎం కేసీఆర్.. 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి అవతారమెత్తారు. ఆ రాష్ట్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం తన రెండో బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సభలో బడ్జెట్‌ ప్రసంగం చేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగనున్న బడ్జెట్‌ 2 లక్షల కోట్లను దాటనుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడు రోజుల బడ్జెట్‌ సమావేశాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలా 30 నిముషాలకు ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పటికీ యేడాదికి అవసరమైన ప్రణాళికతో బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు. దీంతో బడ్జెట్‌ 2 లక్షల కోట్లను దాటనుందని తెలుస్తోంది. 
 
మరోవైపు గురువారం సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులంతా కలిసి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినేట్‌ ఆమోదం తెలిపింది. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల కోసం పోలీసు శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో భద్రతను ఏర్పాటు చేశారు. శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల కోసం స్పీకర్‌ పోచారం అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.