బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (10:17 IST)

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి బాకా ఊదడం మానుకోవాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి బాకా ఊదడం మానుకోవాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... "గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది.  ఈ సమావేశానికి వైసీపీ హాజరుకాలేదు. హాజరుకాని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

వైసీపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశానికి హాజరై పరిస్థితులను వివరించి ఉంటే మరోలా ఉండేదేమో. వైసీపీ అహంకారంతో వ్యవహరించడం భావ్యంకాదు. 150 సీట్లు వచ్చాయని, మేం ఏం చేసినా చెల్లుతుందనుకోవడం వారి అహంకారానికి నిదర్శనం. వైసీపీ నాయకులు రాష్టానికేదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా తెగ బాధపడిపోతున్నారు.

రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు. రాజ్యాంగం పట్ల గౌరవంతో వ్యవహరించాలి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక ఫుల్ షేప్ లో ఉన్న ఎన్నికలని మళ్ళీ ఫుల్ షేప్ లో నిర్వహించాలని నేడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ఉంది, ఎన్నికలు వద్దని ఇప్పుడు చెబుతున్నారేగానీ, గతంలో కరోనా ప్రొటోకాల్ ని పాటించలేదు.

ఉదాహరణకు విజయవాడలో ఆలయాల పునర్నిర్మణం పేరుతో శంఖుస్థాపన చేసినచోట ఎక్కడా కరోనా ప్రొటోకాల్ పాటించలేదు.  ప్రభుత్వానికి ఇంగిత జ్నానంలేదు. నచ్చితే ఓకే, నచ్చకపోతే కోర్టులు అంటారు. కరోనా ఉంది, ప్రస్తుతం ఎన్నికలు వద్దని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

అనేక ఉద్యోగస్థులకు రావాల్సిన డిఆర్, పీఆర్ సీల గురించి మాట్లాడాలేగానీ, ఎన్నికలు వద్దని మాట్లాడడం భావ్యం కాదు ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడాలి, సమాజిక అంశం మీద ఉద్యమం చేస్తుంటే ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తే అర్థం ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న తిరుపతి ఎలక్షన్ ను పోస్టుపోన్ చేయమని అడగలేరు.

విందులు, సంబరాలు, ఉత్సవాలు చేసుకునేటప్పుడు గుర్తుకు రాని కరోనా ఎన్నికలనగానే గుర్తుకొచ్చిందా?. వైసీపీవారు మాట్లాడేటప్పుడు చట్టాలను తెలుసుకుని మాట్లాడాలి.  ఎన్నికలు నిర్వహించకుండా సుప్రీంకోర్టుకు వెళ్తామని నాయకులు అంటున్నారు. కోర్టులకు వెళ్లి ప్రజల కోట్లాది ధనాన్ని దుర్వినియోగం చేయడం వైసీపీకి అలవాటే. గ్రామాల సౌభాగ్యాన్ని కోరుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలు జరపాలి" అని పేర్కొన్నారు.