తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. కరోనా.. మాస్క్‌లు తప్పనిసరి
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున కొండకు చేరుకున్నారు. శనివారం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం ముందుగానే అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలైంది. టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రతతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది టీటీడీ. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని ఇప్పటికే భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.
మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.