శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేడు ఆ తరహా టిక్కెట్లు రద్దు
శ్రీవారి భక్తులకు తితిదే ఆలయ అధికారులు ఓ హెచ్చరిక చేశారు. వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్లను రద్దు చేసినట్టు వారు తెలిపారు. ఈ టిక్కెట్లను ఈ నెల 22వ తేదీన మంజూరు చేస్తుంటారు. వీటిని జారీని నిలిపివేసినట్టు పేర్కొన్నారు. అయితే, శ్రీవారి భక్తులు తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ సందర్భంగా డిసెంబరు 23వ తేదీన వైకుంఠ ఏకాదశి, 24వ తేదీన వైకుంఠ ద్వాదశి సందర్భంగా డిసెంబరు 22వ తేదీన శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో మంజూరు చేసే సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భక్తులు తిరుమలలో వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపింది. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుందని వివరించారు. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
పర్వదినాల సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, డిసెంబరు 31, జనవరి ఒకటో తేదీల్లో శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊజంల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం సేవలను తితిదే రద్దు చేసింది. సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తామని, పది రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబోమని తితిదే అధికారులు వెల్లడించారు.