శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 13 మే 2021 (19:26 IST)

అనాధ శవాలకు అన్నీతానై తిరుపతి ఎమ్మెల్యే అంత్యక్రియలు

కరోనా లాంటి ప్రాణాంతక మహమ్మారి బారినపడి మరణిస్తే సొంత కుటుంబ సభ్యులే రాని పరిస్థితి. అలాంటిది అనాధలైతే. ఇక చెప్పనవసరం లేదు. గత రెండురోజులుగా కరోనాతో మృతి చెందిన ఏడుగురి అనాధ శవాలకు దగ్గరుండి మరీ అంత్యక్రియలు చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ స్మశానవాటికలో మృతదేహాలను స్వయంగా మోసుకొచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు. ప్రస్తుత సమయంలో మానవత్వం చూపించాల్సిన సమయం వచ్చిందని.. కరోనా కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను అనాధలుగా వదిలేయడం మంచిది కాదన్నారు.
 
కరోనా అన్నది మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అతిగా భయపడాల్సిన జబ్బు కాదు. భయమే మనల్ని చంసేస్తుందని గ్రహించాలి. మనలో మానవత్వం వెల్లివిరిసి చనిపోయిన వారి మృతదేహాలు తీసుకెళ్ళాలనే ఆలోచన అందరిలో రావాలి. దైవ కార్యక్రమంగా భావించి ఏడుగురి అనాధ మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. 
 
గతంలో కూడా తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన 31 మంది అనాధ శవాలకు కూడా భూమన కరుణాకర రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని మార్చురీ నుంచి మృతదేహాలను మోసుకొచ్చి కరకంబాడి రోడ్డులోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు తిరుపతి ఎమ్మెల్యే.