శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (07:19 IST)

రైలు పట్టాలపై దారుణం : కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని..

deadbodies
విజయనగరం జిల్లా చీపురుపల్లికి సమీపంలోని బాతువా - సిగడం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి ఘోరం జరిగింది. రైలు పట్టాలపై ఐదుగురు శవాలుగా తేలారు. వీరంతా అస్సాం వాసులే. రైలు పట్టాలు దాటుతుండగా, రెప్పపాటులో దూసుకొచ్చిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు నుంచి సిల్చార్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు (12515)లోని జనరల్‌ బోగీలో స్వల్పంగా పొగలు వచ్చాయి. దీంతో అందులోని ప్రయాణికులు చైన్‌లాగారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామ సమీపంలో రాత్రి 8.30 గంటల సమయంలో రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే అందులోని కొందరు ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దిగారు. 
 
ఒకవైపున కొందరు పట్టాలపైన నిల్చుని ఉండగా... అదే ట్రాక్‌పైకి భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020) దూసుకొచ్చింది. అమిత వేగంతో వచ్చిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలపై ఉన్న ప్రయాణికులు గమనించలేకపోయారు. దానిని గమనించి పక్కకు తప్పుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 
 
రైలు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోయంబత్తూరు-సిల్చార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనే శ్రీకాకుళం తరలించి ఆస్పత్రిలో చేర్చారు. మృతులంతా అసోంకు చెందిన వారని తేలింది.