ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ రకం వాహనాలు రోడ్డెక్కవు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 యేళ్ళు దాటిన ప్రభుత్వ వాహనాలు ఇకపై రోడ్లపై తిరగవు. వీటిని తుక్కు కింద విక్రయిస్తారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్రంలో వచ్చేనెల ఒకటి నుంచి వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులోభాగంగా తొలుత ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాహనాలను తుక్కు చేయనున్నారు.
ఇలాంటివి ఏపీఎస్‌ఆర్టీసీతో కలిపి 440 ఉన్నట్లు లెక్కతేల్చారు. 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్థ్య పరీక్ష (ఫిటెనెస్ టెస్ట్)లో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలుత 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నింటినీ తుక్కు చేయనున్నారు. ఈ విధానానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఏపీ సైతం సమ్మతం తెలిపింది. దీంతో అన్ని శాఖల వద్ద 15 ఏళ్లు దాటిన వాహనాలు ఎన్ని ఉన్నాయనేది లెక్కలు తీశారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రవాణా శాఖ రికార్డుల ప్రకారం ప్రభుత్వశాఖలు అన్నింటా కలిపి ఇప్పటివరకు 37 వేల వాహనాలు 15 ఏళ్లు దాటాయి. దీనిపై అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులతో పరిశీలన జరిపించారు. ఇందులో ఇప్పటికీ రోడ్డెక్కుతున్నవి 440గా తేల్చారు. దశాబ్దాలుగా వివిధ శాఖలు కొనుగోలు చేసిన వాహనాలను ఏళ్ల తరబడి వినియోగించి తుక్కు చేసినప్పటికీ రవాణాశాఖ వద్ద ఆ వివరాలు నమోదు చేయించలేదు. తాజాగా లెక్కతేలిన 440 వాహనాల్లో 220 ఆర్టీసీ బస్సుల ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఈనెలాఖరుతో పక్కనపెట్టనున్నారు.