ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీ భక్తులు
దసరా ఉత్సవాలు ముగిసిన వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం భవానీ దీక్షాపరులైన భక్తులతో రద్దీగా మారింది. అన్ని క్యూలైన్లు భవానీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనితో నేడు, రేపు ఇంద్రకీలాద్రి పై విఐపి, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. ఇక అన్నీ సాధారణ దర్శనాలే అని ప్రకటించారు.
భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు వెబ్ దునియాకు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలకు అనుమతించడం లేదు. నేడు కూడా రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్వించుకునేందుకు భవానీ భక్తులు క్యూ కట్టారు. ఎర్రని దుస్తులతో, నెత్తిన ముడుపులు కట్టుని భవానీ మాలతో భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, భక్తులు తెలంగాణా, కర్నాటకల నుంచి కూడా దుర్గమ్మ దర్శానానికి వస్తుండటం విశేషం.