మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (15:45 IST)

ఊరెళుతున్నారా? అయితే ఈ సిస్టంతో మీ ఇంట్లో దొంగతనం జరగదు, ఎలా?

దొంగలను పట్టుకునేందుకు తిరుపతిలో పోలీసులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి వచ్చే దొంగలను సులువుగా గుర్తించి వారిని పట్టించే సిస్టంను ఉపయోగిస్తున్నారు. దొంగతనం జరక్కుండా అడ్డుకట్ట వేస్తున్నారు. 

 
టెంపుల్ సిటీ తిరుపతిలో ఈమధ్యకాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో అర్బన్ జిల్లా పోలీసులకు ఇదొక సవాల్‌గా మారింది. లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టం పేరుతో ఒక కొత్త సిస్టంను అర్బన్ జిల్లా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. 

 
దీంతో బంధువుల ఇళ్ళకు వెళ్ళే వారు ఈ సిస్టంను ఇంట్లో ఏదో ఒక ప్రాంతంలో ఉంచి వెళితే పోలీసుల పర్యవేక్షణలో ఇది పనిచేస్తూ ఉంటుంది. తిరుపతి నగరంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న సాయిశంకర్ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్ళింది. పోలీసుల సలహాతో ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను ఇంట్లో అమర్చి వెళ్ళారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగతనానికి వచ్చాడు ఒక దొంగ. 

 
పోలీసుల పర్యవేక్షణలో సిస్టం ఉండటంతో సులువుగా దొంగను గుర్తించారు. వెంటనే స్థానికంగా ఉన్న బ్లూకోర్ట్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసుల అలజడి తెలుసుకున్న దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొంగ ఫోటో మొత్తం సిస్టంలో నిక్షిప్తమైంది. సులువుగా దొంగను పట్టుకుంటామంటున్నారు అర్బన్ జిల్లా పోలీసులు. ఇంటికి తాళాలు వేసి బయటి ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.