గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (19:37 IST)

అఘాయిత్యాలపై ప్రథమ స్థానం... అభివృద్దిలో అట్టడుగు స్థానం : వైఎస్ షర్మిల

Sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తగా అడుగంటి పోయాయని, మహిళలపై అఘాయిత్యాలు, డ్రగ్స్ వినియోగంలో మొదటి స్థానంలో ఉందన, అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలను, అఘాయిత్యాలను నివారించడంలో గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర శాసనమండలిలో జరిగిన చర్చే అందుకు నిదర్శనమన్నారు.
 
'2014-19 మధ్య రాష్ట్రంలో 83,202 కేసులు నమోదయ్యాయట. 2019-24 మధ్య నమోదైనవి 1,00,508 కేసులట. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ ఆరోపిస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకు సగటున 59 అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని వైసీపీ అంటోంది.
 
గత పదేళ్లలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే, మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోంది. రాష్ట్రంలో నేరాలను అరికట్టలేని వైసీపీ, టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలి. నిర్భయ, దిశ వంటి చట్టాలు పేరుకు మాత్రమే. మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే నిర్భయ చట్టం కింద 40 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు... దిశ చట్ట కింద 20 రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని జగన్ మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారే తప్ప... చట్టాలను మాత్రం అమలు చేయలేదు. పదేళ్లలో ఒక్క నేరస్తుడికైనా కఠిన శిక్ష పడిందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
 
కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. అభివృద్ధిలో చివరిస్థానం... డ్రగ్స్ వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో ప్రథమస్థానం... ఇదీ మన రాష్ట్ర దుస్థితి అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.