చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అదే కోవలో మరో పథకాన్ని ప్రజలకు అందించనుంది.
తోపుడుబండ్లు, చిన్నచిన్న షాపుల ద్వారా వ్యాపారం చేసుకునేవారి కోసం జగనన్న తోడు పేరుతో వడ్డీలేని రుణాలను అందిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని లక్షలాది మంది చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున సున్నావడ్డీ రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈనెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన కసరత్తు జరగుతోంది. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది ప్రభుత్వం. ఆ తర్వత గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిన అనంతరం మండల స్థాయి అధికారులకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు చేరుతోంది.
జగనన్న తోడు పథకం కింద రుణం పొందిన వారు నెలసరివాయిదాల్లో నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. ఈ ఏడాది మొదట్లో ఈ పథకం కోసం వివరాలు సేకరించినా పథకం అమలు ఆలస్యమైంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాల కోసం వివరాలు సేకరిస్తోంది. వైఎస్ఆర్ కాపునేస్తం కింద 45-60 ఏళ్ల మధ్య వయసున్న పేద కాపు మహిళలకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో పాటు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్ధిక సాయం చేయనుంది ఏపీ ప్రభుత్వం.