గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (08:27 IST)

తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోక పోయినా పోలవరం పూర్తిచేస్తాం : జీవీఎల్

gvl narasimha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రం అంగీకరించకపోయినా పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంచేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'పోలవరం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుంది. నిజం చెప్పాలంటే వాళ్లు ఒప్పుకోవడంతో పని లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా కేంద్ర చట్టంలో ఉంది' అని అన్నారు. 
 
పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలానికి ముంపు వస్తుందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం నిర్మాణం తథ్యమని స్పష్టం చేశారు. వరద నష్టాల అంశాన్ని పార్లమెంటులోని జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం దృష్టికి తీసుకెళతామని, కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి వివరిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు రాజకీయం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదో 2015లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక ఆర్థిక సహాయానికి నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలు మళ్లీ ప్రత్యేక హోదా అడగడం ఏమిటని ఆయన నిలదీశారు.