మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (12:13 IST)

ఆఫర్లు వచ్చినా మారలేదు.. నిలిచారు.. గెలిచారు.. ఎవరు వారు?

వైకాపాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పార్టీ మారాలని పలు ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు మాత్రం పార్టీ మారలేదు. ఐదేళ్ళ పాటు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని తెలుసు. అయినప్పటికీ వారు వెనుకంజవేయలేదు. గెలిచిన పార్టీపక్షానే ఉంటామని భీష్మిప్రతిజ్ఞచేశారు. ఫలితంగా ముగిసిన ఎన్నికల్లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎమ్మెల్యేలంతా గుంటూరు జిల్లాకు చెందిన వారే. వారే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరి ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి పోటీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను చిత్తుగా ఓడించారు. 
 
మరో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గురజాల ఎమ్మెల్యే. ఈయనకు కూడా టీడీపీ నుంచి అనేక ఆఫర్లు వచ్చాయి. అయినా పార్టీ మారలేదు. ఫలితంగానే ఈయనకు గత ఎన్నికల కంటే అత్యధిక ఓట్ల మెజార్టీని కట్టబెట్టారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో ఢీకొట్టి 21 వేల మెజర్టీతో గెలుపొందారు. 
 
ఇదేవిధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫాని. ఆయన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. ఈయన వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టీడీపీ ఎంపీకి సన్నిహితంగా మెలిగారేగానీ పార్టీ మాత్రం మారలేదు. అలాగే, సొంత నిధులు ఖర్చు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ఆయనకు ప్రజలు మరోమారు పట్టం కట్టారు. 
 
అదేవిధంగా కోన రఘుపతి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు కూడా ఐదేళ్ళ పాటు ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోయినా వారు ఏమాత్రం కుంగిపోలేదు. ఫలితంగానే వారికి ప్రజలు మళ్లీ పట్టంకట్టారు. వీరిలో ఇద్దరికి మంత్రిపదవులు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.