ఇచ్చాపురం వైసీపీకి అందని ద్రాక్ష.. వైఎస్ జగన్ కొత్త వ్యూహం.. ఏంటది?
ఏపీ రాజకీయాల్లో ఇచ్చాపురం నియోజకవర్గం ఇప్పటివరకు వైసీపీకి మాత్రం అందని ద్రాక్షగానే మారింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇచ్చాపురం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రస్తుతం టీడీపీ నేత బెందాళం అశోక్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. వైసీపీ తరఫున 2014లో నర్తు రామారావు, 2019లో పిరియా సాయిరాజ్, 2024లో పిరియా విజయమ్మ పోటీ చేసినా ఫలితం దక్కలేదు. నేతల మధ్య గ్రూప్ రాజకీయాలే వైసీపీకి ప్రధాన అడ్డంకిగా మారాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
ఈసారి ఎలాగైనా ఇచ్చాపురాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో వైసీపీ అధినేత జగన్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన వైసీపీ, మాజీ రెడ్డిక కార్పొరేషన్ ఛైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించిందనే ప్రచారం జరుగుతోంది.
అయితే గ్రూపుల రాజకీయాలకు పేరున్న ఇచ్చాపురంలో అందరినీ ఏకం చేయడం శ్యాంప్రసాద్ రెడ్డికి పెద్ద సవాలేనని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.