స్వయం పోషకాలుగా శిల్పారామాలు... కడపలో రూ.80 కోట్లతో ఆధునీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పారామాలను స్వయం పోషకాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. నవ్యాంధ్రలో శిల్పారామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి జనరంజకంగా త
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పారామాలను స్వయం పోషకాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. నవ్యాంధ్రలో శిల్పారామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి జనరంజకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే స్థానిక పరిస్థితులను అనుసరించి, అక్కడి వాస్తవ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని స్పష్టం చేసారు. సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో కడపలో ఆధునీకరించ తలపెట్టిన శిల్పారామంకు సంబంధించిన ప్రతిపాదనలపై, సచివాలయంలో మంగళవారం మీనా సమీక్ష నిర్వహించారు.
శిల్పారామం ప్రత్యేక అధికారి జయరాజ్‌తో పాటు ఇన్‌ఫినిటీ ఆర్కిటెక్చర్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి అనుభూతి పటేల్ తదితరులు శిల్పారామం ఆధునీకరణపై సమావేశంలో వీడియో ప్రజెంటేషన్ చేసారు. ఇక్కడ 2009లో 72 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామంను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం దీనిని పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వివిధ సంస్థల డిపిఆర్‌లను పరిశీలిస్తున్న పర్యాటక శాఖ ఇన్‌ఫినిటీ అర్కిటెక్చర్ తయారుచేసిన ప్రతిపాదనను పరిశీలించింది.
కడప శిల్పారామం ఆధునీకరణకు ప్రాధమికంగా రూ.80 కోట్లు వ్యయంకాగలవని అంచనా వేయగా, ఈ మొత్తంలో 80 శాతం నిధులను బిఓటి ప్రాతిపదికన సమకూర్చుకోవాలని నిర్ణయించారు. మిగిలిన 20 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుండగా, ఈ నిధులతో ఏ పనులు చేయాలన్నా దానిపై స్పష్టత ఉండాలని మీనా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వెచ్చించే నిధులు నిరర్ధక పెట్టుబడిగా మారరాదని, మౌలిక వసతుల కల్పనకు వాటిని వినియోగించేలా ప్రతిపాదనలను సరిదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఒక అతిథి గృహం ఉండాలని, అధికారులు, సిబ్బందికి సంబంధించిన కార్యాలయం కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. ఇక్కడ శిల్పారామంకు 72 ఎకరాల భూమి ఉండగా తొలిదశలో 20 ఎకరాలలో అత్యాధునిక శిల్పారామంను నిర్మించనున్నారు.
ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్, అన్ని రకాల అవసరాలకు ఉపయోగపడేలా కన్వెన్షన్ హాల్, ప్రత్యేకించి చిన్నారుల ఆటస్థలంతో పాటు వారికే నిర్థేశించిన ఉద్యానవనం, యాంపీ థియేటర్, కళాకారుల ప్రదర్శన శాలలు, పూర్తిస్థాయి పార్కింగ్ వంటి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రత్యేకించి ప్రవేశద్వారంను తెలుగుదనం ప్రతిబింబించేలా రూపుదిద్దనున్నారు. మరోవైపు శిల్పారామం రాత్రి సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉండాలని, ఫుడ్ కోర్టులు 24 గంటలు పనిచేసేలా ఉండాలన్నారు. అయితే కార్యదర్శి సూచించిన మార్పులకు అనుగుణంగా రూపుదిద్దుకునే తుది ప్రతిపాదనను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అధ్యక్షతన జరిగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ బోర్డు సమావేశం ముందు ఉంచుతారు. సిఎం తుది ఆమోదానికి లోబడి తదుపరి పనులు వేగవంతం అవుతాయి.