గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:25 IST)

''జై శ్రీరామ్'' అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. తారక మంత్రాన్ని పఠిస్తే?

భారతదేశంలో అతి పురాతన పుణ్యధామాలలో ఒకటిగా, మహిమాన్విత ధామాలలో ఒకటిగా పేరుప్రఖ్యాతులు సాధించిన 'అయోధ్య'కు ఆ పేరు రావడానికి శ్రీరాముడి తాతముత్తాతలే కారణం. శ్రీరాముని తాతలలో ఒకరైన 'అయుధ' అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది.
 
ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన ఈ నగరంలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి, విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాముడి తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు, రాజసాగరుడు, భగీరధుడు విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది. గౌతమబుద్ధుడు అయోధ్య నగరాన్ని ఐదుసార్లు సందర్శించినట్టు తెలుస్తుంది.
 
అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు 'కుశుడు' నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది.
 
అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. ముక్తిక్షేత్రంగా, స్వర్గ ధామంగా పేరు గాంచిన ఈ నగరంలోకి అడుగిడినంత మాత్రానే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణ మహాకావ్యానికి వేదికగా నిలిచిన అయోధ్య నగరం చేరుకోవడం చాలా సులువు. అయోధ్య చిన్న నగరమే అయినప్పటికీ ఇక్కడ భక్తులకు కావల్సిన అనేక వసతులున్నాయి.
 
అందుకే ''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే" అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. 
 
రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు "రా'' అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే ''మ'' అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందువల్లే మానవులకు ''రామనామ స్మరణ'' మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. అందుకే తారక మంత్రమైన రామ నామాన్ని అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా పఠిద్దాం.. శ్రీరాముని ఆశీస్సులు, అనుగ్రహాన్ని పొందుదాం..