ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2024 (23:39 IST)

నటి సాయిపల్లవి: భారత సైన్యం గురించి ఏం మాట్లాడారు, సోషల్ మీడియాలో రేగుతున్న వివాదం ఏంటి?

Saipallavi
కర్టెసి-ట్విట్టర్
సినీనటి సాయిపల్లవిపై సోషల్ మీడియాలో వివాదం రేగుతోంది. ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’ అనే హ్యాష్‌టాగ్‌ను కొందరు నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. “భారత సైన్యంపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై ఆమె తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే” అని నెటిజన్ తన్మయ్ కులకర్ణి ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. “సాయి పల్లవి ఏం చెప్పిందో చాలా మందికి అర్థం అయిందని నేను అనుకోను” అని గాయని చిన్మయి శ్రీపాద ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
 
శివ కార్తీకేయన్- సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదల సందర్భంగా సాయి పల్లవిపై ట్రోలింగ్ జరుగుతోంది. బాయ్‌కాట్ సాయిపల్లవి అనే హ్యాష్‌ట్యాగ్‌‌ను కొందరు నెటిజన్లు ‘ఎక్స్‌’లో ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడిన మాటలపై నెటిజన్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.
 
అసలేంటి వివాదం...?
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “పాకిస్తానీలకు భారత సైన్యం టెర్రరిస్టుల్లాగా, భారతీయులకు పాక్ సైన్యం టెర్రరిస్టుల్లాగా కనిపిస్తుంది” అని సాయి పల్లవి అన్నారు. ఈ మాటలకు సంబంధించిన చిన్న క్లిప్ వైరల్‌గా మారింది. “సాయి పల్లవి మాటలు చూస్తుంటే ఆమె జకీర్ నాయక్ మాటలకు ప్రభావితమైనట్లుగా అర్థమవుతోంది. ఆమె నటించిన సినిమాలు చూడొద్దు” అంటూ @mrsinha_ అనే నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
 
అదే ఇంటర్వ్యూకు సంబంధించిన ఇంకో చిన్న క్లిప్‌లో
“ఆ సమయంలో కశ్మీరీ పండిట్లపై జరిగిన హింసకు, కరోనా సమయంలో వాహనంలో ఆవును తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌పై జరిగిన హింసకు తేడా ఏముంది” అని సాయి పల్లవి అన్నారు. అయితే, దీనిపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆవుల స్మగ్లింగ్‌, కశ్మీరీ పండిట్లపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే అంటున్న ఈ హీరోయిన్ బాలీవుడ్‌లో ‘సీత’ పాత్రలో నటిస్తోంది అంటూ @profesorsahab ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ వేశారు. “హిందుత్వానికి, భారత సైన్యానికి సాయి పల్లవి వ్యతిరేకి. ఆమె నటించిన సినిమాను బహిష్కరించేందుకు ప్రయత్నిస్తాం” అని హిందు ఐటీ సెల్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ వేసింది. ఇలా చాలా మంది సాయి పల్లవి వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.
 
సాయి పల్లవి మాటల్లో అర్థం వేరే ఉందా...?
“సోషల్ మీడియా యుగంలో 30 సెకన్లు లేదా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో చూసి నిర్దిష్టమైన అభిప్రాయానికి రావొద్దు. ఆ మాటలకు సంబంధించిన పూర్తి వీడియో చూసిన తరువాతే ఓ అభిప్రాయానికి రావాలి” అని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు బీబీసీ తెలుగుతో చెప్పారు.
 
సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళ్తే..
గతంలో రానా దగ్గుబాటి - సాయి పల్లవి జంటగా ‘విరాట పర్వం’ చిత్రంలో నటించారు. ఈ సినిమా నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. 2022 జూన్‌ 17న విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘గ్రేట్ ఆంధ్ర’ యూట్యూబ్ చానల్‌కు సాయి పల్లవి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ 2022 జూన్ 12న యూట్యూబ్‌లో ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఏం చెప్పారంటే..
 
యాంకర్ : సినిమాలో నక్సలైట్ యూనిఫామ్ వేసుకున్నారు కదా. వారిపై ఏమైనా సింపతీ కలిగిందా?
సాయి పల్లవి: హింస అనేది ‘రాంగ్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్’ అని నమ్ముతాను. నక్సలిజం తప్పా? ఒప్పా? అన్నది చేప్పే స్థితిలో నేను లేను. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్లు మన జవాన్లను టెర్రరిస్టులు అనుకుంటారు. ఎందుకంటే, మనం వాళ్లకు హాని చేస్తామని. అలాగే, మన వాళ్లకు అవతలి వారు టెర్రరిస్టుల్లా కనిపిస్తారు. చూసే కోణాన్ని బట్టి దృక్పథం మారిపోతుంది. హింసాత్మక కమ్యూనికేషన్ నాకు అర్థం కాదు. కాబట్టి, ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది మనం చెప్పలేం.
 
యాంకర్: మీరు లెఫ్టిస్ట్ ఉద్యమాలు చూసే ఉంటారుగా?
సాయి పల్లవి: నేను పెరిగిన వాతావరణ పరిస్థితుల వల్ల లెఫ్ట్, రైట్ వింగ్‌లను న్యూట్రల్‌గా చూస్తున్నాను. లెఫ్ట్ లేదా రైట్ వింగ్ కుటుంబాల్లో పుట్టి ఉంటే ఏదో ఒక సైడ్ తీసుకునేదాన్నేమో. కానీ, నేను అలాంటి కుటుంబాల్లో పుట్టలేదు. బాధితుల పక్షాన నిలబడే మంచి మనిషిగా ఉండటం మా కుటుంబం నేర్పింది.
 
లెఫ్ట్ లేదా రైట్ వింగ్‌లలో ఎవరు కరెక్ట్ అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే, ఉదాహరణకు కశ్మీరీ ఫైల్స్ సినిమాలో అప్పట్లో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా! అది మతపరమైన ఘర్షణ అనుకుంటే, కరోనా సమయంలో ఓ వాహనంలో ఆవును తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌ని కొందరు కొట్టి, జై శ్రీరాం అని చెప్పారు. అయితే, అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? నేను ఏం చెబుతానంటే, బలవంతులు బలహీనుల్ని తొక్కేయడం తప్పు. ఆ తప్పును ఎత్తిచూపే వైపు నిలబడాలి. మంచి మనుషులుగా ఉండేవాళ్లు ఎప్పుడూ న్యూట్రల్‌గా ఉంటారు.
 
ఇవీ ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలు, సాయి పల్లవి చెప్పిన సమాధానాలు.
 
ఈ వివాదంపై ఎవరేమంటున్నారు?
ఈ వివాదంపై గాయని చిన్మయి స్పందించారు.
 
“సాయి పల్లవి ఏం చెప్పిందో చాలా మందికి అర్థం అయిందని నేను అనుకోను. గత పదేళ్లుగా విమర్శనాత్మక, హేతుబద్ధమైన ఆలోచలను క్రమపద్ధతిగా నాశనం చేశారు. ఎందుకంటే, ప్రశ్నించే వాళ్లు అర్బన్ నక్సల్స్ లేదా దేశ వ్యతిరేకులు” అని చిన్మయి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ వివాదాన్ని రెండు వైపులా చూడాలని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు బీబీసీ తెలుగుతో చెప్పారు.
 
“సెలబ్రిటీలను జనాలు గమనిస్తుంటారు కాబట్టి రాజకీయ,మతపరమైన సున్నిత అంశాలపై మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. మిగతా అంశాలపై మాట్లాడినట్లుగా సున్నితమైన అంశాలపై స్టేట్‌మెంట్స్ ఇవ్వకూడదు” అని ప్రభు అన్నారు. “సాయి పల్లవి ‘సీత’ పాత్ర చేయకూడదనే వాదనలు సరికాదు. ఓ ఆర్టిస్ట్ ఏ పాత్ర అయినా చేయొచ్చు. వ్యక్తిగత అంశాలతో ముడిపెడుతూ పాత్రలకు సరిహద్దులు గీయలేరు” అని ప్రభు అన్నారు.
 
‘సాయిపల్లవి మాటల్లో తప్పేముంది?’
"సాయి పల్లవి చెప్పినదాంట్లో తప్పేముంది. ట్రోలర్ చేసే విమర్శలకు సరైన ఆధారం ఉండదు. మనోభావాలు, సంప్రదాయాల పేరిట వీళ్లు చేసే దాడి రోజురోజుకు మితిమీరుతోంది. సినిమా రంగంలోనే కాదు, ప్రతి రంగంలోనూ మహిళలపై ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. అది బాధాకరం" అని సామాజిక కార్యకర్త కె.సజయ బీబీసీ తెలుగుతో అన్నారు.
 
సాయి పల్లవి స్పందన ఏంటి..?
సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదంపై సాయిపల్లవి స్పందించలేదు. మరోవైపు, దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సాయి పల్లవి ఆదివారం సందర్శించి నివాళులు అర్పించారు. “మన కోసం ప్రాణాలు అర్పించిన వేలాది సైనికుల వివరాలు ఉంచిన పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్, సిపాయి విక్రమ్ సింగ్‌లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యా” అని సాయి పల్లవి ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.