యువరాజ్ సింగ్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై నారింజ పండ్ల యాడ్, వివాదం ఏంటి?
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంస్థ యూ వీ కెన్ రొమ్ము క్యాన్సర్‌పై ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్ వివాదాస్పదంగా మారింది. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి దిల్లీ మెట్రోలో ఆ సంస్థ కొన్ని ప్రకటనలను అంటించింది. దీనిపై చాలామంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ వివాదం తర్వాత, దిల్లీ మెట్రో ఈ ప్రకటనలను తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో అనేకమంది యూజర్లు ఈ యాడ్‌పై విమర్శలు చేశారు. అయితే, ఈ యాడ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నది మాత్రమే మా ఉద్దేశ్యం. మేం ఎవర్నీ బాధపెట్టాలనుకోలేదు అంటరూ యూజర్ల ప్రశ్నలకు యూ వీ కెన్ సమాధానం ఇచ్చింది.
వివాదం ఎలా మొదలైంది?
అక్టోబర్ 23 బుధవారంనాడు, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్ దిల్లీ మెట్రోలో కనిపించింది. ఈ ప్రకటనలో రొమ్మును ఆరెంజ్ (నారింజ పండు)తో పోల్చారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా.. నెలకు ఒకసారి మీ నారింజ పండ్లను పరీక్షించుకోండి అని ఈ ప్రకటనలో ఉంది. దిల్లీ మెట్రోలో వచ్చిన ఈ ప్రకటన ఫోటోను జర్నలిస్ట్ రీతుపర్ణ ఛటర్జీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
చెక్ యువర్ ఆరెంజెస్ అంటూ ఇచ్చిన రొమ్ము క్యాన్సర్ ప్రకటనను యువరాజ్ సింగ్ సంస్థ ఒక క్రియేటివ్ చాయిస్ అని పేర్కొంది. దీనితో నేను ఏకీభవించను అని ఆమె రాశారు. ఈ క్రియేటివ్ ఐడియాను చూసిన ఎవరైనా ఇది మహిళల పట్ల ఉన్న చిన్నచూపని అంటారు అని మరో యూజర్ రాశారు. మీ మెదడు బాగానే పనిచేస్తోందా? ఈ ప్రకటనకు బాధ్యులు ఎవరు? ఇది పూర్తిగా నిర్లక్ష్యపూరిత ప్రకటన. అని మరో యూజర్ రాశారు.
క్యాన్సర్‌పై మీరు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. కానీ, మీ యాడ్ ఏజెన్సీని మార్చేయండి. వక్షోజాలను నారింజ పండ్లతో పోల్చడం సరికాదు. అని మరొక యూజర్ సూచించారు.
దిల్లీ మెట్రో ఏం చెప్పింది?
అక్టోబర్ 23(బుధవారం) సాయంత్రమే ఈ వ్యాపార ప్రకటనను తొలగించినట్లు దిల్లీ మెట్రో తెలిపింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ప్రకటనను దిల్లీ మెట్రో రైలులో వేశాం. ఇది సరిగ్గా లేదని డీఎంఆర్సీ గుర్తించి, వెంటనే చర్యలు తీసుకుంది అని దిల్లీ మెట్రో సోషల్ మీడియా ఎక్స్‌లో రాసింది. 2024 అక్టోబర్ 23న ఒక్కసారి మాత్రమే దిల్లీ మెట్రోలో ఈ ప్రకటన వచ్చింది. అదే రోజు సాయంత్రం 7.45కు ఆ ప్రకటనను తొలగించాం. ప్రజల సెంటిమెంట్ల విషయంలో డీఎంఆర్సీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించదు అని తెలిపింది.
ఈ ప్రకటన సరైంది కాదు. పబ్లిక్ ప్లేసుల్లో ప్రచురించే ప్రకటనలు పాటించాల్సిన కనీస షరతులకు కూడా ఇది లోబడి లేదు. భవిష్యత్‌లో దిల్లీ మెట్రో మళ్లీ ఇలాంటి ప్రకటనలను జారీ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది అని చెప్పింది.
యువరాజ్ సింగ్ యూ వీ కెన్ ఏం చెప్పింది?
యువరాజ్ సింగ్ సంస్థ తాము ఇచ్చిన ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌ను సమర్థించుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై జర్నలిస్టు రీతూపర్ణ ఛటర్జీ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈ సంస్థ, రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటం ఎంత కష్టమో తమకు తెలుసని పేర్కొంది. సన్నిహితులతో తప్ప మరెవరితో దీని గురించి మాట్లాడేందుకు ప్రజలు ఆసక్తి చూపరని తెలిపింది.
మా ప్రకటనలో నారింజ పండ్లను వాడటం సాహాసోపేతమైన నిర్ణయం. సునిశితంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. రొమ్ము క్యాన్సర్‌పై ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడమే మా ఉద్దేశ్యం అని యూ వీ కెన్ చెప్పింది. మిమ్మల్ని బాధపెట్టే ఏ యాడ్‌ను మేం ఉపయోగించం. ప్రాణాలు రక్షించే చర్యలను ప్రోత్సహించడమే మా ఉద్దేశ్యం. దీనిపై మా కార్యక్రమాలు కొనసాగుతాయి అని తెలిపింది.