సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (12:24 IST)

జేఎన్‌యూ విద్యార్థులకు దీపికా మద్దతు... ట్రెండింగ్ అవుతున్న #BoycottChhapaak

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనవర్సిటీ దగ్గర జరుగుతున్న నిరసనల్లో బాలీవుడ్ నటి దీపికా పదుకోణె పాల్గొన్నారు. యూనివర్సీటీలో జరిగిన దాడిని ఆమె ఖండించారు. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఆమె మద్దతు తెలిపారు. కాంపస్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆ సమయంలో #BoycottChhapaak అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అయింది. ఈ ట్యాగ్‌తో పోస్టులు చేసిన కొందరు దీపికా తదుపరి సినిమా చపాక్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే, మరికొందరు దీన్ని వ్యతిరేకించడంతో పాటు, దీపికాకు మద్దతు పలికారు.
 
రాత్రి 7.30 గంటల సమయంలో దీపికా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ నిరసన తెలుపుతున్నవారితో కలిసి నిలబడ్డారు. దాడిలో గాయపడిన విద్యార్థి నాయకురాలు ఐషీ గోష్‌ను కలిసి, మాట్లాడారు.
 
అయితే, దీపిక ఎలాంటి ప్రసంగం చేయలేదు. అక్కడున్న కొందరితో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
 
జేఎన్‌యూలో పరిస్థితి ఎలా ఉంది? 
"జేన్‌యూ అంటే చాలా శాంతియుతమైన ప్రదేశంగా గుర్తింపు ఉంది. ఏ అంశం పైనైనా మేం చర్చిస్తాం, మాట్లాడుకుంటాం, సమస్యలను పరిష్కరించుకుంటాం. ఎలాంటి సమస్యకైనా హింస పరిష్కారం కాదు. మా కేంపస్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం" అని జేఎన్‌యూ వీసీ ఎం.జగదీశ్ కుమార్ అన్నారు.
 
సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని ఆయన తెలిపారు. యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రాంగణం బయట నిరసన చేశారు. జేఎన్‌యూలో దాడిని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులో విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
 
మంగళవారం నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏబీవీపీ సభ్యులు చేసిన దాడిలో ఎన్ఎస్‌యూఐ సభ్యుడు, హార్దిక్ పటేల్‌కు అనుచరుడు అయిన ఓ వ్యక్తి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఇద్దరిని డిశ్చార్జి చెయ్యగా, మరో ఇద్దరు వీఎస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
 
ఢిల్లీలోని జేఎన్‌యూలో దాడి ఘటనను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడానికి పాల్డిలోని ఏబీవీపీ కార్యాలయానికి ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు చేరుకున్నారు. బీజేపీ అనుబంధ ఏబీవీపీ కార్యాలయాన్ని మూసేయాలని, ఏబీవీపేనే ఈ దాడికి కారణమని తమను ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు బెదిరించారని ఏబీవీపీ ఆరోపించింది.
 
ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. సోమవారం నాడు కూడా ఐఐఎం-అహ్మదాబాద్ వెలుపల నిరసనకారులు జేఎన్‌యూ దాడిని ఖండిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఏబీవీపీకి చెందిన నిరసనకారులు కూడా ఉన్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
పోలీసులు అక్కడే ఉండగా ఇదెలా జరుగుతుంది అని హార్దిక్ పటేల్ ప్రశ్నించారు. పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలు కలిసి ఎన్ఎస్‌యూఐ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్ఎస్‌యూఐ సభ్యులను బెదిరించేందుకు చేసిన కుట్ర ఇది అని ఆయన అన్నారు.
 
"ఏబీవీపీకి చెందిన దుండగులు నా ఫ్రెండ్ నిఖిల్ సవానిపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కానీ దాన్ని ఆపడానికి అక్కడే ఉన్న పోలీసులు ఏమీ చెయ్యలేదు" అని జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేశారు. దీనిపై ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ వాఘేలా బీబీసీ గుజరాతీ ప్రతినిధి భార్గవ్ పారిఖ్‌తో మాట్లాడారు.
 
"కాంగ్రెస్ ముందుగా ఓ విషయం తెలుసుకోవాలి... వాళ్లు ఎవరికోసం పోరాడుతున్నారు? చానళ్లలో ప్రసారమైన వీడియోల్లో జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ కనిపించారు. వాటిలో ఆమె ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేస్తూ, ఏబీవీపీ వర్కర్లను బెదిరిస్తున్నారు. ఎన్ఎస్‌యూఐ వారికి మద్దతిస్తోంది. గుజరాత్‌ను నాశనం చేయాలని చూస్తోంది. గుజరాత్ కాలేజీలలో జేఎన్‌యూ తరహా దాడులు మేం జరగనివ్వం. నిరసన తెలపడం, వ్యతిరేకించడం వారి హక్కు. కానీ, ఏబీవీపీ కార్యాలయాన్ని ఎందుకు మూసేయాలంటున్నారు? మేం ఘర్షణ జరగకూడదనే ప్రయత్నించాం. వాళ్లు మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే మేం కూడా తగిన రీతిలో స్పందిస్తాం" అని ఆయనన్నారు.
 
"ఎన్ఎస్‌యూఐ వారి కార్యాలయంపై దాడికి ప్రయత్నించింది. ధ్వంసం చేసింది. పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. వాళ్లు మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. ఎన్ఎస్‌యూఐ వర్కర్లు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఆ సమయంలో ఏబీవీపీ సభ్యులు లాఠీలతో అక్కడికి వచ్చి, మమ్మల్ని కొట్టడం ప్రారంభించారు. పోలీసులు అక్కడే ఉన్నారు. కానీ ఏమీ చెయ్యలేదు. మేం ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తాం, కానీ ప్రస్తుతానికి మా కార్యకర్తలను రక్షించుకోవడంపైనే మా దృష్టి" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాజ్ సింగ్ పార్మర్ అన్నారు.
 
ఇప్పటి వరకూ ఈ ఘటనలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వాస్నా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీయూ పారెఖ్ తెలిపారు. మాకు అందిన సమాచారం ఆధారంగా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని బీబీసీకి తెలిపారు. "హింస జరిగి ఉండకూడదు. రెండువైపుల నుంచి విచారణ జరుగుతుంది. పోలీసులను విచారణ చెయ్యనివ్వండి" అని గుజరాత్ బీజేవైఎమ్ ప్రెసిడెంట్ రుత్విజ్ పటేల్ అన్నారు.