గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 3 ఆగస్టు 2022 (20:57 IST)

అల్ జవహిరి-హెల్‌ఫైర్: టార్గెట్‌కు తప్ప, చీమకు కూడా హాని చేయకుండా ఆ మిసైల్ ఎలా దాడి చేస్తుంది, ఆపరేట్ చేసేది ఎవరు?

Al-Qaeda, Ayman al-Zawahiri
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక ఇంట్లో నివసిస్తున్న అల్ ఖైదా అధినేత అయ్‌మాన్ అల్ జవహిరి.. జూలై 31వ తేదీన సూర్యుడు ఉదయించిన ఒక గంట తర్వాత బాల్కనీలోకి నడుచుకుంటూ వచ్చాడు. ఈజిప్టుకు చెందిన ఈ జిహాదీవాదికి.. ప్రార్థన తర్వాత అలా బాల్కనీలో నడవటం ఇష్టమని చెప్తారు. కానీ అతడికి అవే చివరి అడుగులు.

 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 06 గంటల 18 నిమిషాలకు.. ఆ బాల్కనీ మీదకు రెండు మిసైళ్లు దూసుకొచ్చి ఢీకొట్టాయి. ఆ దాడిలో 71 ఏళ్ల అల్ జవహిరి చనిపోయాడు. ఇంటి లోపల ఉన్న ఆయన భార్యకు, కుమార్తెకు ఏమీ కాలేదు. ఈ దాడిలో విధ్వంసం మొత్తం కేవలం బాల్కనీకి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. అంత కచ్చితమైన నిర్దిష్టతతో దాడి చేయటం ఎలా సాధ్యమైంది? అమెరికా గతంలో ఇలాంటి దాడుల విషయంలో, దాడుల లక్ష్యాల్లో పొరపాట్ల కారణంగా పౌరులు చనిపోవటం పట్ల విమర్శలు ఎదుర్కొంది. కానీ, ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా తమ లక్ష్యమైన అల్-జవహిరి ఒక్కడినే గురిచూసి మిసైల్ దాడిలో చంపింది. అందుకోసం వాడిన క్షిపణి మొదలుకుని.. జవహిరి అలవాట్లను నిశితంగా అధ్యయనం చేయటం వరకూ.. ఈ నిర్దిష్ట దాడికి దోహదపడ్డ అంశాలు అనేకం ఉన్నాయి. ఈ తరహా దాడులు మున్ముందు మరిన్ని జరుగుతాయి.

 
లేజర్ కచ్చితత్వం
ఈ దాడికి ఉపయోగించిన మిసైల్ చాలా ముఖ్యమైన అంశం. డ్రోన్ ద్వారా పేల్చిన 'హెల్‌ఫైర్స్' అనే క్షిపణులను ఈ దాడిలో వాడినట్లు అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇది గగనతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే క్షిపణి రకం. 2001 సెప్టంబర్ 11 దాడుల అనంతరం.. అమెరికా విదేశాల్లో ఉగ్రవాదం మీద చేపట్టే ఆపరేషన్లలో ఈ క్షిపణిని వాడటం సాధారణంగా మారింది. ఈ క్షిపణిని వివిధ రకాల వేదికల నుంచి ప్రయోగించవచ్చు. హెలికాప్టర్ల నుంచి, భూతల వాహనాల నుంచి, నౌకల మీద నుంచి, విమానం నుంచి.. లేదంటే మానవరహిత డ్రోన్ నుంచి కూడా దీనిని సంధించవచ్చు. జవహిరి మీద ఈ క్షిపణులను మానవ రహిత డ్రోన్ ద్వారా ప్రయోగించారు.

 
2020 ఆరంభంలో ఇరాన్ సైనిక జనరల్ కాసిం సొలేమానీని బాగ్దాద్‌లో చంపటానికి, బ్రిటన్‌లో పుట్టిన ఇస్లామిక్ స్టేట్ జిహాదీవాది 'జిహాదీ జాన్'ను 2015లో సిరియాలో చంపటానికి అమెరికా ఈ హెల్‌ఫైర్ క్షిపణులనే ఉపయోగించినట్లు చెప్తారు. ఈ హెల్‌ఫైర్ మిసైల్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించటానికి ప్రధాన కారణాల్లో దీని కచ్చితత్వం ఒకటి. ఒక మిసైల్‌ను డ్రోన్ నుంచి లాంచ్ చేసినపుడు.. దాని లక్ష్యానికి సంబంధించిన లైవ్ వీడియో దృశ్యాలను డ్రోన్‌కు అమర్చివున్న కెమెరా సెన్సర్లు లైవ్ వీడియోను శాటిలైట్ ద్వారా ప్రసారం చేస్తాయి. ఆ ప్రసారాన్ని అమెరికా భూభాగం మీద ఎయిర్‌కండిషన్డ్ గదిలో కూర్చున్న వెపన్స్ ఆపరేటర్ వీక్షిస్తుంటారు.

 
ఆ ఆపరేటర్ తన ముందు కనిపించే స్క్రీన్ మీద 'టార్గెటింగ్ బ్రాకెట్ల'ను ఉపయోగించటం ద్వారా.. టార్గెట్‌ను 'లాక్ అప్' చేసి, ఆ లక్ష్యం మీదకు లేజర్‌ను గురి పెడతారు. ఇక అప్పుడు మిసైల్‌ను ఫైర్ చేశాక.. అది లేజర్ చూపిన మార్గంలో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఢీకొడుతుంది. డ్రోన్‌ను ఆపరేట్ చేసే సిబ్బంది దాడి చేసేముందు.. పౌరుల మరణాలు అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలని, దీనిని వినియోగించేవారు పాటించాల్సిన విధివిధానాలో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో అమెరికా సైన్యంగానీ, సీఐఏగానీ చేపట్టిన ఇలాంటి దాడుల సందర్భంలో.. ఆదేశం ఇవ్వటానికి ముందుగా సైనిక న్యాయవాదలును కూడా సంప్రదింపుల కోసం పిలిపించటం ఒక విధానంగా ఉండేది.

 
ఇలాంటి దాడుల్లో 'టార్గెట్' విలువకు, పౌరుల మరణాల ముప్పుకు మధ్య అధికారులు సంతులనం సాధించాల్సి ఉండేదని.. సైరాక్యూస్ యూనివర్సిటీ ఫర్ సెక్యూరిటీ పాలసీ అండ్ లా వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ విలియం బ్యాంక్స్ పేర్కొన్నారు. ఆయన ఇలాంటి లక్షిత హత్యల అంశంపై నిపుణుడు. జవహిరి మీద దాడి ఈ ప్రక్రియకు అనుసరించాల్సిన ఒక నమూనా లాగా కనిపిస్తోందని ఆయన అభివర్ణించారు. ''కేవలం జవహిరి ఒక్కడినే చంపేలా, మరెవరికీ హాని కలుగకుండా చూసేలా..అతడిని ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రదేశంలో ఉండేలా చూసి దాడి చేయటానికి సదరు అధికారులు చాలా జాగ్రత్తలు పాటించినట్లు కనిపిస్తోంది'' అని ప్రొఫెసర్ బ్యాంక్స్ చెప్పారు.

 
అలాగే.. జవహిరి మీద దాడి కోసం హెల్‌ఫైర్ క్షిపణులకు సంబంధించి ఇప్పటివరకూ పెద్దగా తెలియని ఆర్9ఎక్స్ రకపు క్షిపణిని ఉపయోగించినట్లుగా చెప్తున్నారు. ఈ విషయం నిర్ధారణ కాలేదు. ఈ రకపు మిసైల్ తన వేగపు శక్తితో లక్ష్యాన్ని ముక్కలు చేసుకుంటూ దూసుకెళ్లటానికి ఆరు బ్లేడ్లను ఉపయోగిస్తుంది. 2017లో అల్ ఖైదా మరో నేత, అల్ జవహిరి అనుయాయుల్లో ఒకరైన అబు ఖాయిర్ అల్-మస్రీని సిరియాలో ఆర్9ఎక్స్ హెల్‌ఫైర్ క్షిపణితో చంపినట్లు చెప్తారు. ఆ దాడి అనంతరం తీసిన అతడి వాహనం ఫొటోల్లో.. మిసైల్ ఆ వాహనం పైకప్పుకు రంధ్రం పెట్టి లోపలికి దూసుకెళ్లి, అందులో ఉన్నవారిని తునాతునకలు చేసినట్లు కనిపిస్తోంది. ఇతరత్రా పేలుళ్లు జరిగినట్లు కానీ, వాహనాన్ని మరేవిధంగా ధ్వంసం చేసినట్లు కానీ ఆ ఫొటోల్లో కనిపించదు.

 
జవహరి 'బాల్కనీ అలవాటు'
కాబూల్‌లో అల్ జవహిరి మీద దాడి చేయటానికి ముందు అమెరికా సేకరించిన నిఘా సమాచారం ఏమిటనే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఇంట్లో జవహిరి జీవనశైలిని అర్థం చేసుకోవటానికి తమకు తగినంత సమాచారం లభించిందని.. ఈ దాడి అనంతరం అమెరికా అధికారులు చెప్పారు. అతని జీవన శైలిలో బాల్కనీలోకి వచ్చే అలవాటు ఒకటి. దీనినిబట్టి.. అమెరికా గూఢచారులు ఆ ఇంటిని నెలల నుంచీ కాకపోయినా కొన్ని వారాలుగా ఆయనను గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

 
ఈ దాడికి ముందు అనేక రకాల నిఘా పద్ధతులను ఉపయోగించి ఉండవచ్చునని సీఐఏ మాజీ సీనియర్ అధికారి మార్క్ పాలిమెరోపోలస్ బీబీసీతో చెప్పారు. క్షేత్రస్థాయిలో గూఢచారులతో పాటు, సంకేతాల ద్వారా నిఘా సమాచారం సేకరించటం వంటివి అందులో ఉంటాయన్నారు. అమెరికాకు చెందిన డ్రోన్లు కానీ చిన్నపాటి విమానాలు కానీ.. కింద ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా తిరుగుతూ.. ఆ ఇంటిని, ఆ ప్రాంతాన్ని కొన్ని వారాల పాటు, లేదా కొన్ని నెలల పాటు గమనిస్తూ ఉండి ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు.

 
''టార్గెట్ తాము నిర్దేశించిన వ్యక్తేనని దాదాపు కచ్చితంగా నిర్ధారించేది ఏదైనా అవసరం. అలాగే ఇతరత్రా ప్రాణనష్టాలకు తావులేని పరిస్థితులను - అంటే పౌరుల ప్రాణాలకు ముప్పు లేని పరిస్థితులను కూడా నిర్ధారించుకోవాలి. అందుకు చాలా సహనం అవసరమవుతుంది'' అని మార్క్ పేర్కొన్నారు. అల్ ఖైదా నేతలు, ఇతర ఉగ్రవాద టార్గెట్లను వెదికి పట్టుకోవటంలో అమెరికా నిఘా వ్యవస్థ దశాబ్దాల తరబడి సముపార్జించిన అనుభవం.. జవహరి మీద దాడికి ఉపయోగపడిందని ఆయన చెప్పారు.

 
''ఈ విషయంలో మనం అద్భుతంగా పనిచేస్తున్నాం. అమెరికా ప్రభుత్వం 20 ఏళ్లలో చాలా మంచి నైపుణ్యం సాధించిన రంగమిది'' అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. అమెరికా నిర్వహించే ఇలాంటి ఆపరేషన్లు అన్నివేళలా అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగవు. 2021 ఆగస్టు 29వ తేదీన కాబూల్ విమానాశ్రాయానికి ఉత్తరాన.. స్థానిక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ శాఖ లక్ష్యంగా ఒక డ్రోన్ దాడి చేశారు. కానీ ఆ దాడిలో ఐసిస్ సభ్యులకు బదులు 10 మంది అమాయక ప్రజలు చనిపోయారు. ''ఒక విషాదకర పొరపాటు'' చేశామని పెంటగాన్ అంగీకరించింది.

 
ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌లో సీనియర్ ఫెలోగా ఉన్న బిల్ రోగియో.. అమెరికా డ్రోన్ దాడులను చాలా ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. జవహిరి మీద దాడి చేసిన ప్రదేశానికి సమీపంలో అమెరికా ప్రభుత్వం కానీ, ప్రతినిధులు కానీ లేనందువల్ల.. అమెరికా గతంలో నిర్వహించిన ఆపరేషన్ల కంటే ఇది చాలా కష్టమైన ఆపరేషన్ కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో గతంలో చేసిన డ్రోన్ దాడుల కోసం.. అఫ్గానిస్తాన్ నుంచి డ్రోన్లను పంపించారు. అలాగే సిరియాలో చేసిన దాడులను.. తమ మిత్ర భూభాగమైన ఇరాక్‌ నుంచి నిర్వహించి ఉండవచ్చు.

 
''అక్కడ దాడి ప్రాంతాలను చేరుకోవటానికి అమెరికాకు చాలా సులభం. క్షేత్ర స్థాయిలో తమ ఏజెంట్లు కూడా అమెరికాకు ఉన్నారు. కానీ ఇది (జవహరి మీద దాడి) చాలా సంక్లిష్టమైన దాడి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమించిన తర్వాత.. ఆ దేశంలో అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్ మీద చేసిన మొదటి దాడి ఇది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

 
ఇలా మళ్లీ జరుగుతుందా?
అఫ్గానిస్తాన్‌లో అల్ ఖైదా టార్గెట్ల మీద ఈ తరహా దాడులు మళ్లీ జరిగినా ఆశ్చర్యం లేదని రోగియో చెప్పారు. ''లక్ష్యాలకు కొదవ లేదు. అల్ ఖైదా తర్వాతి నాయకులు ఇప్పటికే అఫ్గాన్‌లో లేకపోయినట్లయితే వారు అక్కడికి చేరుకునే అవకాశం చాలా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు. ''ఈ పనిని సులువుగా చేసే సామర్థ్యం అమెరికాకు ఇంకా ఉందా? లేదంటే ఇది సంక్లిష్ట ప్రక్రియగా మారుతుందా? అనేది ప్రశ్న'' అని రోగియో అభిప్రాయపడ్డారు.