శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 30 జులై 2022 (16:57 IST)

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? హరిత సూసైడ్ లెటర్‌లో ఏం రాసింది?

Harita
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాల్సి ఉంది. కానీ అంతలోనే 17 ఏళ్ల విద్యార్థిని జాస్తి హరిత వర్షిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో జరిగింది. కానీ రాష్ట్రమంతా చర్చనీయమైంది. ఆమె తన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు కలవరపరుస్తున్నాయి. తన తండ్రి చేసిన అప్పుల వసూలు కోసం వచ్చిన బ్యాంకు రికవరీ ఏజెంట్ల తీరుతో ఆమె కలత చెందిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. నందిగామ పోలీసులు హత్య కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హరిత వర్షిణి మృతి ఘటనపై ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.

 
‘ఎంసెట్ ర్యాంక్ రాక చనిపోయిందని చెప్పు’
నందిగామ రైతుపేటలో ఉండే జాస్తి ప్రభాకర్, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హరిత వర్షిణి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్‌ చదివేందుకు సిద్ధమవుతోంది. ప్రభాకర్ ప్రస్తుతం దిల్లీలో ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని అప్పు మొత్తం సకాలంలో చెల్లించలేకపోయారు. దాదాపుగా రూ. 3.5 లక్షల వరకూ ఆయన అప్పుపడ్డారు. తన ఉద్యోగంలో వచ్చిన ఆటుపోట్లు కారణంగా ఆయన చెల్లింపులు ఆలస్యమైనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. తండ్రి అప్పుల్లో ఉన్నందున తన చదువులతో పాటుగా, చెల్లి ఫీజుల భారం కూడా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం హరిత తన ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 
'ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడమే కష్టమవుతోంది. చెల్లి స్కూల్ ఫీజులకు కూడా డబ్బులు లేవు. నేను మీకు భారం కాకూడదు. చెల్లిని బాగా చదివి, ఉద్యోగం తెచ్చుకోమను. డాడీ డబ్బులు పంపిస్తాడో లేదో, ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఎవరైనా అడిగితే ఎంసెట్ ర్యాంక్ రాలేదని చనిపోయిందని చెప్పు' అంటూ ఆ లేఖలో పేర్కొంది.

 
‘రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణం’
నిజానికి హరిత వర్షిణికి ఏపీఈఏపీ సెట్‌లో సుమారు 15 వేల ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో ఆమెకు ఇంజినీరింంగ్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఆమె తన చెల్లి చదువులతో పాటుగా, తన చదువుల భారం కూడా తల్లిపై పడుతుందనే భావనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అయితే ఆమె ఆత్మహత్యకు ముందు రోజు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంట్లమంటూ వచ్చినవారి ప్రవర్తనే కారణమని మృతురాలి తల్లి అరుణ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 
"గతంలో ఓసారి వచ్చారు. అప్పుడు కూడా ఇద్దరు వచ్చారు. ప్రభాకర్ మీ ఆయనేనా అని అడిగారు. చెప్పాం. వెళ్లారు. ఇప్పుడు కూడా ఇద్దరు వచ్చారు. వారిలో ఒకరి పేరు పవన్ అని చెప్పారు. గేదెలు కాయించుకోండి మీ పిల్లల చేత అంటూ నోటికొచ్చింది మాట్లాడారు. అవన్నీ నా పిల్లలను బాధపెట్టాయి. నా బిడ్డ అన్నీ విన్నది. అమ్మా.. పరువు పోయింది అంటూ ఏడ్చింది. అప్పటి నుంచి అన్నం కూడా తినలేదు. ఏజెంట్లు బెదిరించారు. నన్ను స్టేషన్‌కి కూడా నడవమన్నారు" అంటూ అరుణ మీడియా ముందు వాపోయారు. తన బిడ్డ మృతికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని, వారే హరితను చంపేశారంటూ ఆమె ఆరోపిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

 
పోలీసులు ఏమంటున్నారంటే..
హరిత తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రైమ్ నెం. 237/2022గా ఐపీసీ 306తో పాటుగా రెడ్ విత్ 34 సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే పోస్ట్ మార్టమ్ నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. "రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది. బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఎంత, రికవరీ ఏజెంట్లు ఎంతవరకూ కారణమన్నది పరిశీలిస్తున్నాం. వివరాలు సేకరిస్తున్నాం. ఆత్మహత్య లేఖలో ఆమె ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోంది. కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అంటూ నందిగామ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనకరావు బీబీసీకి తెలిపారు.

 
ఆత్మహత్యకు కారకులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. హరిత వర్షిణి ఆత్మహత్యకు అప్పులే కారణమని, వాటి కోసం బ్యాంకు ఏజెంట్లు చేసిన ఒత్తిడి వల్ల ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. "రికవరీ ఏజెంట్ల తీరు వల్ల ఓ విద్యార్థిని ప్రాణం పోయింది. తండ్రి చేసిన అప్పులకు కూతురు బలికావాల్సి వచ్చింది. అప్పులు కొద్దికొద్దిగా తీరుస్తామని తల్లి చెబుతున్నా వినకుండా, ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఏజెంట్లను కఠినంగా శిక్షించాలి. వారి తీరు వల్ల అనేక మందికి సమస్య అవుతోంది. ప్రైవేటు లోన్ యాప్‌ల పేరుతో ఓ వైపు వేధింపులు పెరుగుతుండగా, బ్యాంకులు కూడా ఈ రీతిలో సామాన్యులను పీడించడం దారుణం. బడాబాబులకు లక్షల కోట్లు రైటాఫ్, మాఫీలు చేస్తూ మూడున్నర లక్షల అప్పుకి ఓ విద్యార్థిని ప్రాణాలు తీసే పరిస్థితి రావడం విచారకరం. సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు కఠినంగా ఉండాలి" అంటూ ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపీ నాయక్ అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన బీబీసీతో అన్నారు.

 
రికవరీ ఏజెంట్ల తీరుపై విమర్శలు
వివిధ బ్యాంకుల్లో అప్పులు రికవరీ కోసం ప్రైవేటు సంస్థలకు రికవరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా సంస్థల సిబ్బంది అప్పులు చెల్లించాల్సిన వారి పట్ల హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నందిగామ కేసులో రికవరీ ఏజెంట్ల మీద ఏకంగా కేసు కూడా నమోదైన నేపథ్యంలో వారిని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

 
"రికవరీ ఏజెంట్ల ధోరణి విపరీత పోకడలకు దారితీస్తుంది. ఏదో ఒకటి చేసి అప్పులు వసూలు చేస్తేనే వారి ఉద్యోగం ఉంటుంది. కాబట్టి అందుకోసం అవతలి వారి పరిస్థితితో సంబంధం లేకుండా వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలాంటి అనేక సందర్భాల్లో అపశృతులకు కారణమవుతోంది. వారికి ఓ నిబంధనావళి ఉండాలి. అప్పులు తీసుకున్న వారికి కూడా హక్కులుంటాయి. చట్ట ప్రకారమే చర్యలుండాలి. అంతే తప్ప దౌర్జన్యం, దురుసుతనం ప్రదర్శించకుండా అదుపులో పెట్టాలి. లేదంటే మరిన్ని దుష్పరిణామాలు ఎదుర్కొంటాం" అంటున్నారు సామాజిక విశ్లేషకుడు చెవులు కృష్ణాంజనేయులు.

 
పెద్ద మొత్తాల్లో అప్పులు ఎగ్గొట్టిన వారి పట్ల ఉదారంగా ఉంటూ, సామాన్య ప్రజల మీద బ్యాంకులు ప్రదర్శించే దూకుడు ఎలా ఉంటుందో ఈ ఘటన చాటుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకులు కూడా ఓ విధానం రూపొందించాలని బీబీసీతో అన్నారు. నందిగామలో రికవరీ ఏజెంట్లపై కేసు నమోదయిన ఘటనపై స్టేట్ బ్యాంకు అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. రికవరీ విభాగంతో పాటు రీజనల్ ఆఫీసు అధికారులు కూడా తమ పరిధిలో స్పందించే విషయం కాదని బీబీసీకి తెలిపారు. రికవరీ సంస్థల సిబ్బంది వ్యవహారశైలితో తమకు సంబంధం ఉండదని ఎస్‌బీఐ అధికారులు అన్నారు.