'విశాఖపట్నం సీమవాసులకు దూరాభారం' : పవన్ కళ్యాణ్

ktramarao
బిబిసి| Last Updated: బుధవారం, 8 జనవరి 2020 (13:03 IST)
రాజధానిని అమరావతి నుంచి తరలించడం, భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయడమేనని, విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారని ఓ పత్రిక పెద్ద కథనాన్ని రాసింది. 
 
"రాయలసీమవాసులకు విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. ఈ విషయమై సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై వైసీపీ ప్రభుత్వం పట్టునట్టు వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. వాటి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవు" అని ఆయన విమర్శించారు.
 
రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతాల్లో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దం పట్టిందన్నారు. వారిని అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. రాజధాని మార్పు ఉద్యోగులకూ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందని పవన్‌ తెలిపారు.
 
"హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. వాళ్లను మళ్లీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలకు ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయి. అన్ని ప్రాంతాలకు ఇది(విశాఖ) త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తి కలిగించడం లేదు" అని ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు. మంగళవారం చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని పవన్ తప్పుబట్టారు.
 
రైతులను, మహిళలను భయపెట్టి, వారిని నిరసనల నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. నిరసన మొదలుకాక ముందే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను గృహ నిర్భందంలో ఉంచారని, పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారని, ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమనుకుంటే పొరపాటని చెప్పారు.
 
కేటీఆర్: వచ్చే ఏడాది నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో ఐటీ క్యాంపస్‌లు 
తెలంగాణలో అన్ని ద్వితీయశ్రేణి నగరాలకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని విస్తరిస్తామని, వరంగల్‌ నుంచి ఆ విస్తరణ ప్రారంభమయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) తెలిపారని నమస్తే తెలంగాణ చెప్పింది.
 
చారిత్రక వరంగల్‌ నుంచి ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌లో త్వరలో ఐటీ క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ చెప్పారు. వచ్చే ఏడాది నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు విస్తరిస్తామన్నారు.
 
వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండలోని ఐటీ పార్క్‌లో ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన సైయెంట్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను మంత్రి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
 
ఐటీరంగ నిపుణులు, ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సదస్సుల్లో ఆయన మాట్లాడుతూ- నిట్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలే కాకుండా విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండటం వరంగల్‌లో ఐటీ అభివృద్ధికి సానుకూల అంశాలవుతాయన్నారు. బెంగళూరుకు మైసూరు, ముంబయికి పుణె ఎలాగో హైదరాబాద్‌కు వరంగల్‌ అలాంటిదని పేర్కొన్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగంలో వస్తున్న మార్పులు, సౌకర్యాలు, సౌలభ్యాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరణ అనివార్యంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ముంబయి, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాలతో పోలిస్తే వరంగల్‌ లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న యువత అందుబాటులో ఉంటుందని వివరించారు.
 
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకి 
తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని సాక్షి తెలిపింది. మున్సిపల్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
evm vote
 
ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం వరకు విడుదల చేయొద్దని సోమవారం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. రిట్‌ పిటిషన్‌పై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం దీనిని తోసిపుచ్చుతూ ఏకవాక్య తీర్పు చెప్పింది. పూర్తి తీర్పు పాఠం వారం పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
 
విచారణ సందర్భంగా ధర్మాసనం.. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ఐదేళ్లు పూర్తి అయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాలని, తెలంగాణలో మున్సిపాలిటీలకు 2019 జులై 2న ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఇప్పటికైనా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
 
గత నెల 23న వెలువడిన ఎన్నికల షెడ్యూల్‌లో మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని, ఈ నెల 22న పోలింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కచ్చితంగా చెప్పిందని, ఈ నేపథ్యం లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పలానా తేదీన ఎన్నికలని చెప్పిన తర్వాత న్యాయ సమీక్ష చేసే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది.
 
ఏపీలో ఐదు మార్గాల్లో ప్రైవేటు రైళ్లు 
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు ప్రజాశక్తి తెలిపింది. తిరుపతి-విశాఖపట్నం, తిరుపతి-లింగంపల్లి మార్గాల్లో వీటిని నడిపేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని చెప్పింది. దీనికి సంబంధించిన టెండర్లను ఈ నెలలోనే పిలవనున్నారు. ఆరు నెలల్లో వీటిని ఖరారు చేయనున్నారు.
tirupati railway station
 
ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య తేజస్‌ ప్రైవేట్‌ రైళ్లు తిరుగుతున్నాయి. అహ్మదాబాద్‌-ముంబై మార్గంలో ఈ నెల 19న అందుబాటులోకి రానుంది. ప్రైవేట్‌ రైళ్లలో డ్రైవర్లు, గార్డులను రైల్వే శాఖ అందిస్తుంది. ప్రమాదాలు జరిగితే సహాయ చర్యలు, బీమా, ఇతరాలన్నీ చూసుకుంటుంది. మిగిలిన సౌకర్యాల బాధ్యత ప్రైవేట్‌ ఆపరేటర్లదే. మార్కెట్‌ ఆధారిత ఛార్జీలను ఆపరేటర్లు వసూలు చేస్తారు.

దీనిపై మరింత చదవండి :