మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 19 మార్చి 2020 (20:50 IST)

కరోనా వైరస్: ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘నా ప్రియమైన దేశ ప్రజలారా.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తే అది కొన్ని దేశాలకు పరిమితమవుతుంది. కానీ ఈ మహమ్మారి మానవాళి మొత్తాన్నీ చుట్టుముట్టింది.

 
కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంటే మనం గత రెండు నెలలుగా ఆందోళనగా చూస్తున్నాం. 130 కోట్ల మంది భారతీయులు ఈ ప్రపంచ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. జాగ్రత్తలు పాటించటానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే.. కొన్ని రోజులుగా అంతా బాగానే ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ కరోనావైరస్ వంటి ఒక ప్రపంచ మహమ్మారిని తేలికగా తీసుకోవటం సరికాదు.

 
పౌరులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. మనమంతా ఉమ్మడిగా కరోనావైరస్ మీద పోరాడాలి. నేను భారత ప్రజలను ఎప్పుడు ఏది కోరినా ఎన్నడూ నిరాశచెందలేదు. మీ అందరి ఆశీస్సులతోనే మనం లక్ష్యాల దిశగా పయనిస్తున్నాం. ఇప్పుడు ప్రజలందరినీ మరొకటి కోరుతున్నా.

 
నాకు మీకు రాబోయే కొన్ని వారాలు కావాలి. మీ రాబోవు సమయం కొంత కావాలి. ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దానికి ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉండడం సర్వ సాధారణం.

 
ప్రపంచంలో కొన్ని దేశాల్లో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ పరిశోధనల్లో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా వ్యాధి విస్ఫోటనంలా వ్యాపించింది. ఈ దేశాల్లో వైరస్ సోకిన రోగుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని ఈ విశ్వ మహమ్మారి వ్యాపించడాన్ని, దీని ట్రాక్ రికార్డు మీద పూర్తిగా దృష్టి పెట్టింది.

 
ఇటీవల కొన్ని దేశాలు తగిన నిర్ణణయాలు తీసుకున్నాయి. తమ దేశంలో వారికి వీలైనంత వరకూ ఏకాంతంగా ఉండేలా చేసి పరిస్థితిని చక్కదిద్దాయి. అందులో పౌరుల పాత్ర చాలా కీలకం. భారత్ లాంటి 130 కోట్ల జనాభా ఉన్న దేశం.. అభివృద్ధికి చెందుతున్న మనలాంటి దేశానికి.. ఈ కరోనా వైరస్ సంక్షోభం మామూలు విషయం కాదు. మిగతా పెద్ద పెద్ద దేశాల్లో ప్రభావం ఎలా ఉందో మనం చూస్తున్నాం.

 
భారత్ మీద దాని ప్రభావం లేదని అనుకోవడం తప్పు. అందుకే ఈ విశ్వ మహమ్మారిని ఎదుర్కోడానికి రెండు విషయాలు చాలా ముఖ్యం. మొదటిది సంకల్పం, రెండోది చొరవ. ఈ రోజు 130 కోట్ల మంది దేశ ప్రజలు తమ సంకల్పం, ఈ విశ్వ మహమ్మారిని ఆపడానికి ప్రతి ఒక్కరూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని సంకల్పం పూనాలి. మనం ఈ రోజు సంకల్పం చేయాలి. మనం స్వయంగా వ్యాపించకుండా కాపాడుకోవాలి. ఇతరులకు వ్యాపించకుండా కాపాడాలి.

 
మిత్రులారా.. ఇలాంటి విశ్వ మహమ్మారి ఒకే మంత్రాన్ని చెబుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో మనం ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరం. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి.. మనం స్వయంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని - స్వచ్ఛందంగా స్వయంగా జనం నుంచి దూరంగా ఉండడం. ఇంటి బయట వెళ్లకుండా ఉండడం. దీనినే సోషల్ డిస్టాన్సింగ్ అని చెప్తున్నారు.

 
ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఈ సోషల్ డిస్టాన్సింగ్ చాలా అవసరం. అందులో మన సంకల్పం చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారని అనిపిస్తే, మీకు ఏం కాదని అనిపిస్తే.. బయటకు వెళ్తూ ఉంటే.. కరోనా వైరస్ నుంచి సురక్షితంగా బయటపడాతామని అనుకుంటే ఆ ఆలోచన మంచిది కాదు.

 
అలా మీరు, మీకు, మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే రాబోయే కొన్ని వారాలపాటు చాలా అవసరమైతే తప్ప మీ ఇటిం నుంచి బయటకు రావద్దని నా వినతి. వీలైనంత వరకూ వ్యాపారమైనా, ఆఫీసు అయినా.. మీ ఇంటి నుంచే పని చేయండి. ప్రభుత్వ సేవల్లో, ఆస్పత్రుల్లో ఉన్నవారు, మీడియా అందరూ యాక్టివ్‌గా ఉండడం అవసరం. కానీ సమాజంలో మిగతా వారిని స్వయంగా మిగతా జనానికి మిగతా సమాజానికి దూరంగా ఉంచుకోవాలని నా వినతి.

 
మన కుటుంబంలో సీనియర్ సిజిటన్స్ ఉంటే.. వారు రాబోవు కొన్ని వారాల వరకూ ఇంటి నుంచే బయటకు వెళ్లకూడదని నా వినతి. 60, 65 సంవత్సరాల పైన వయసున్న వారు ఇంటి నుంచి బయటకు వెళ్లకండి. వచ్చే ఆదివారం మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరుతున్నా. ఇది ప్రజల కోసం, ప్రజలే పాటించే కర్ఫ్యూ కావాలి.

 
ఈ ఆదివారం నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ప్రజా కర్ఫ్యూను అమలు చేయాలి. ఆ రోజంతా మీరు మీ ఇళ్లలోనే ఉండండి. అవసరమైన పనులు ఉన్నవాళ్లు మాత్రమే బయటకు వెళ్లాలి.. వారికి బాధ్యత ఉంటుంది. కానీ పౌరులుగా.. ఎవరినీ చూడ్డానికి కూడా వెళ్లకండి. సంకల్పం తీసుకోండి.

 
దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు చేయాలని కోరుతున్నా. ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాటించే ఈ ప్రజా కర్ఫ్యూ సందేశాన్ని ప్రజల వరకూ చేర్చాలి. వారిని చైతన్యం చేయాలి. పది మంది కొత్తవారికి ఫోన్ చేసి దీని గురించి చెప్పాలి. కరోనా వైరస్ లాంటి విశ్వమహమ్మారి మీద యుద్ధం కోసం భారత్ ఎంత సిద్ధగా ఉందో చూపాల్సిన సమయం ఇది.’’