సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 17 జులై 2020 (14:48 IST)

కరోనావైరస్: దిల్లీలో కేసులు తగ్గడానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెరగడానికి కారణమేంటి?

దేశ రాజధాని దిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతోంది. దేశంలోని కరోనా వైరస్ హాట్‌స్పాట్లలో ఒకటిగా పరిగణిస్తున్న దిల్లీలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయడానికి ఇది సూచనా? వాస్తవ పరిస్థితులేమిటి? అపర్ణ అల్లూరి అందిస్తున్న కథనం. రెండు వారాల కిందట వరకు దిల్లీ ఈ మహమ్మారిని ఎదుర్కోలేక సతమతమైంది.

 
జూన్ నెలలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. రోజురోజుకూ ఇది తీవ్రరూపం దాల్చింది. ఆసుపత్రులు, ప్రయోగశాలలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోయాయి. కానీ, జూన్ చివరి నాటికి పరిస్థితులు కొంతవరకు మారాయి. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య తనిఖీలు చేయడం.. టెస్టింగ్ పెంచడం వంటి.. త్వరగా ఫలితమొచ్చే యాంటీజెన్ టెస్టులు చేయడం వంటివి ముమ్మరంగా చేపట్టారు. ఈ ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు. 

 
టెస్టులు తగ్గించనప్పటికీ కేసుల సంఖ్య తగ్గింది
ప్రస్తుత వారంలో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 1200 నుంచి 1600 మధ్య ఉంటోంది. జూన్ చివరివారంలో ఈ సంఖ్య రోజుకు 3 వేలకు పైగా ఉండేది. మరోవైపు దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో మాత్రం ఇంకా తగ్గుదల కనిపించలేదు. దేశంలోని మరో హాట్ స్పాట్ రాష్ట్రం తమిళనాడులోనూ కేసులు తగ్గుతున్నాయి.

 
అయితే, దిల్లీలో కేసులు తగ్గడానికి కారణాలను శ్రీనాథరెడ్డి విశ్లేషించారు. వాస్తవంగానే కేసులు తగ్గుతుండొచ్చని.. అలాగే ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు బదులు యాంటీజెన్‌ చేస్తుండడంతో కచ్చితత్వం తగ్గి కూడా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతుండొచ్చని అన్నారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులు సంక్లిష్టంగా ఉంటాయి, ఈ పరీక్షల్లో ఫలితం రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకు భిన్నంగా యాంటీజెన్ టెస్టుల్లో ఫలితం నిమిషాల్లోనే వచ్చేస్తుంది.

 
రెండు రకాల పరీక్షల మధ్య ప్రధానంగా కొన్ని తేడాలున్నాయి. యాంటీజెన్ పరీక్షలు వైరల్ ప్రోటీన్స్ ఉన్నాయో లేవో పరీక్షించి దాని ఆధారంగా కరోనావైరస్ సోకిందో లేదో నిర్ధరిస్తారు. అయితే, వైరల్ ప్రోటీన్స్ లేనంత మాత్రాన కరోనావైరస్ సోకలేదని కాదు. అందుకు భిన్నంగా ఆర్టీపీసీఆర్ టెస్టు వైరస్ ఆర్‌ఎన్‌ఏ ఉందో లేదో పరీక్షిస్తుంది. ఇది పాజిటివ్ కేసులను గుర్తించడానికి మరింత సమర్థమైన పరీక్ష.

 
ప్రస్తుతం దేశంలోని టెస్టింగ్ మార్గదర్శకాల ప్రకారం ఎవరినైనా పరీక్షించినప్పడు నెగటివ్ వస్తే వారికి ఆర్టీపీసీఆర్ కిట్‌తో మళ్లీ పరీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి దిల్లీలో ఏ పరీక్షలు ఎన్ని చేస్తున్నారు.. అలాగే ఒకసారి టెస్ట్ చేశాక నెగటివ్ వచ్చినవారికి మళ్లీ రెండోసారి చేస్తున్నారా అనే విషయంలో సరైన డేటా అందుబాటులో లేదు. ''మరణాల సంఖ్య కూడా తగ్గుతుండడంతో కేసుల సంఖ్య తగ్గుతోందని విశ్వసించొచ్చు'' అన్నారు శ్రీనాథరెడ్డి.

 
దిల్లీలో జూన్ చివరి వారంలో రోజుకు సగటున 62 మరణాలు ఉండగా జులై ప్రారంభంలో ఇవి రోజుకు 41కి తగ్గాయి. తమిళనాడు కంటే ప్రస్తుతం తక్కువ మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా తక్కువగా చూపిస్తున్నారని ప్రొఫెసర్ రెడ్డి సహా చాలామంది నిపుణులు అనుమానిస్తున్నప్పటికీ గతం కంటే ఇప్పుడు మరింతగా తగ్గించి చూపిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదన్నారు. టెస్టింగ్ డేటా అస్థిరంగా ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి తీవ్రత అంచనాకు నిర్ధరణయిన కేసులు కాకుండా మరణాలను రెండో కొలమానంగా పరిగణిస్తారు నిపుణులు.

 
యాంటీజెన్ టెస్టులు ఎన్ని చేస్తారు.. అవి ఎంత కచ్చితమైనవన్నది పక్కన పెడితే దిల్లీ ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఇటీవల కాలంలో కొన్ని పటిష్ట చర్యలు చేపట్టిందని రెడ్డి చెప్పారు. ''ప్రజారోగ్యంపై ఎక్కువగా దృష్టిపెట్టారు.. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య తనిఖీలు చేశారు.. టెస్టులు చేశారు.. ప్రజలతో కమ్యూనికేషన్ పెంచారు'' అని ఆయన విశ్లేషించారు.

 
ప్రజలు అప్రమత్తం చేయడం.. అలాగే కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం పెరగడం కూడా కోవిడ్ నియంత్రణకు ఉపకరించిందన్నారు. అయితే, అప్పుడే అంతా అదుపులోకి వచ్చేసిందనుకోవడం మరీ తొందరపాటువుతుందని ప్రొఫెసర్ శ్రీనాథరెడ్డి అన్నారు. కేసులు, మరణాలు రెండూ నిరంతరం తగ్గుతుంటేనే తీవ్రత తగ్గినట్లు అర్థమన్నారు.

 
కేసులు, మరణాలు తగ్గుతున్న సమయంలోనే రోగులను ఆసుపత్రిలో చేర్చి కోలుకునేలా చేసి మరణాల సంఖ్య మరింతగా తగ్గిస్తే ప్రజల్లో ధైర్యం పెరుగుతుందని.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ప్రజలు ముందుకొచ్చి అధికారులు, ఆసుపత్రులను సంప్రదిస్తారని శ్రీనాథరెడ్డి అన్నారు. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారాయన.

 
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని.. తెలంగాణలో పరీక్షలు చేయడమనేది స్థిరంగా లేదని శ్రీనాథరెడ్డి అన్నారు. తమిళనాడులో కేసులు తగ్గడానికి అక్కడ రెండు వారాల పాటు కఠినంగా లాక్ డౌన్ విధించడం కారణం కావొచ్చన్నారాయన. దేశంలో పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.. అయితే, అక్కడ కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అంటే పరీక్షలు కచ్చితమైనవి కాబట్టి కేసుల సంఖ్య కచ్చితమనే భావించాలి.

 
'లాక్ డౌన్ సమయంలో తమిళనాడులో ఫీవర్ క్యాంపులు పెట్టి అనుమానిత కేసులను టెస్టింగ్ కేంద్రాలకు పంపించార'ని చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ డైరెక్టర్ మనోజ్ మురేకర్ చెప్పారు. అయితే, ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా అనేది అప్పుడే చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

 
మహారాష్ట్రలో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో క్రమంగా కేసులు తగ్గుతున్నప్పటికీ థానె, పునె వంటి ఇతర నగరాలు, పొరుగు జిల్లాల్లో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ''లాక్‌డౌన్ తరువాత ప్రభుత్వం ఊహించిన కంటే ఎక్కువగా ప్రజలు ప్రయాణాలు చేశార''ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కోవిడ్-19 నియంత్రణ వ్యవహారాల సలహాదారుగా ఉన్న సుభాష్ సలూంకే అన్నారు.

 
''కలవరపెడుతున్న విషయం మరణాలు.. 10,900కి పైగా కోవిడ్ మరణాలతో మిగతా రాష్ట్రాలన్నిటికంటే మహారాష్ట్ర సంక్లిష్ట స్థితిలో ఉంది'' అన్నారాయన. ముంబయిలో కరోనా ఉద్ధృతి తగ్గుతుంది.. కానీ, అది అంతవేగం జరగకపోవచ్చు అన్నారాయన.