కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఆ వైరస్‌కు ఎక్స్‌పోజ్ కావాలని నోబెల్ బహుమతి అందుకున్నవారు సహా పలువురు శాస్త్రవేత్తలు వలంటీర్లను కోరుతున్నారు. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడికి రాసిన లేఖలో ఆ శాస్త్రవేత్తలు.. ఇలాంటి 'చాలెంజ్ ట్రయల్స్'తో టీకా అభివృద్ధి కార్యక్రమం వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రోగ్రాం డైరెక్టర్ దీనిపై మాట్లాడుతూ ఇలాంటి అధ్యయనాలు మంచి సమాచారం అందివ్వడంతోపాటు సాధ్యమయ్యేవిగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనావైరస్ నివారణకు 23 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్న వలంటీర్లు తమ రోజువారీ జీవితంలో కరోనావైరస్‌కు ఎక్స్‌పోజ్ అయినా అది వారికి సోకకపోతేనే ఆ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు అర్థం. అయితే, ఈ ప్రయోగాల్లో అత్యధికం ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుతున్న దేశాల్లో జరుగుతుండడంతో ఇవన్నీ వచ్చే ఏడాదికి అందుబాటులోకి రావొచ్చు.
15 మంది నోబెల్ గ్రహీతలు సహా 100 మందికి పైగా ప్రముఖులున్న '1 డే సూనర్' అనే సంస్థ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆలస్యం కాకుండా ఈ చాలెంజ్ ట్రయల్స్ జరగాలంటోంది. ఇందుకోసం వలంటీర్లు కావాలంటోంది. ఆరోగ్యవంతులైన యువ వలంటీర్లు ప్రయోగ దశలోని వ్యాక్సిన్లను తీసుకుని ఆ తరువాత కరోనా వైరస్‌కు ఎక్స్‌పోజ్ కావాలని.. వారి వల్ల ఈ సమాజానికి కలిగే ప్రయోజనం అపారమని అంటోంది.
లేఖలో ఏముందంటే..
'' ఈ చాలెంజ్ ట్రయల్స్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను సురక్షితంగా, సమర్థంగా వేగవంతం చేయగలిగితే వాటి వాడకానికి బలం చేకూరుతుంది'' అన్నారు. చాలెంజ్ ట్రయల్స్‌కు మద్దతుగా రాసిన ఆ లేఖపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెనర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్ సంతకం చేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ జెనర్ ఇన్‌స్టిట్యూట్ కూడా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఉంది.
ఈ చాలెంజ్ ప్రయోగాలు వచ్చే నెల నుంచి మొదలు కావొచ్చన్నారు హిల్. కాగా అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ దీనిపై స్పందిస్తూ.. ఈ చాలెంజ్ ట్రయల్స్‌పై చర్చకు పెట్టామన్నారు.
ఇది అనైతికం కాదా?
దీనిపై రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లను కరోనావైరస్ సోకేలాగా తిరగాలని సూచిస్తే అది ప్రమాదకరం కావొచ్చు. ఎందుకంటే వారికి చేసిన వ్యాక్సిన్ కచ్చితంగా పనిచేస్తుందని, వారిని రక్షిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ ఆ వ్యాక్సిన్ పనిచేయకపోతే వారికి కరోనావైరస్ సోకవచ్చు, తీవ్రంగా జబ్బుపడవచ్చు లేదా చనిపోవచ్చు కూడా.
అయితే, ఈ ప్రయోగాన్ని సమర్థిస్తున్న వారు మాత్రం దీనివల్ల ప్రమాదం చాలా తక్కువ అని వాదిస్తున్నారు. కరోనావైరస్ సోకి ఆసుపత్రుల్లో చేరిన ప్రతి 10 మందిలో 9 మంది గతంలోనే జబ్బుపడిన, అనారోగ్యంతో ఉన్నవారు. మరణించినవారిలో ఎక్కువ భాగం వృద్ధులే.
కాబట్టి, ఈ ప్రయోగాన్ని 20ల్లో ఉన్న, శారీరకంగా దృఢంగా ఉన్న యువతకు పరిమితం చేస్తే.. దీనివల్ల తలెత్తే ప్రమాదాలను తగ్గించొచ్చు. కిడ్నీ దానం చేసేవాళ్లు, ప్రసవ సమయంలో చనిపోయేవాళ్లతో పోలిస్తే.. ఈ ప్రయోగం ద్వారా చనిపోయే అవకాశాలున్న వలంటీర్ల సంఖ్య చాలా తక్కువ అని వన్ డే సూనర్ సంస్థ చెబుతోంది.
చాలెంజ్ స్టడీస్ చేయకపోవడమే అనైతికమని, అలాంటి అధ్యయనాలు కనుక చేయకపోతే సమర్థవంతమైన, లక్షలాది మంది ప్రాణాలను కాపాడే కరోనావైరస్ వ్యాక్సిన్‌ను కనుగొనడం కష్టమైపోతుందని ఆ సంస్థ వెల్లడించింది.
ఇలాంటివి ఇంతకుముందు జరిగాయా?
జరిగాయి. చాలెంజ్ స్టడీలకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ఆవుల నుంచి మశూచి ఆవుల కాపరులకు, యజమానులకు సోకిన విషయాన్ని ఎడ్వర్డ్ జెన్నర్ గుర్తించారు. కానీ, మశూచి సోకినవారికి కొద్దిపాటి అనారోగ్యం మినహా ఏమీ కాలేదు.
ఎడ్వర్డ్ జెన్నర్ ఉద్దేశపూర్వకంగా ఒక ఎనిమిదేళ్ల బాలుడికి ఆవులకు సోకిన మశూచి వైరస్ సోకేలా చేశారు. కొంత కాలం తర్వాత మనుషులకు సోకే మసూచి వైరస్ ఆ బాలుడికి సోకేలా చేశారు. కానీ, ఈసారి బాలుడికి వైరస్ సోకలేదు.
కలరా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వాటికి సంబంధించిన వ్యాక్సిన్లను తయారుచేసే క్రమంలో చాలెంజ్ స్టడీస్ నిర్వహిస్తుంటారు. అయితే, ఇలాంటి వలంటీర్లు జబ్బుపడితే, వారికి అందించేందుకు సమర్థవంతమైన చికిత్సా విధానం అందుబాటులో ఉంది.