బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 20 నవంబరు 2024 (17:16 IST)

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

tablets
వందల ఏళ్ల కిందట చైనీయులు ఒంటి మీద ఏదైనా పుండు అయితే బూజు పట్టిన పెరుగుని పూసేవారు. భారతీయులు చవులమోగ్రా నూనెను కుష్టు వ్యాధి పుండ్లకు పూసేవారు. 16వ శతాబ్దంలో సిఫిలిస్ అనే లైంగిక వ్యాధికి యూరప్‌లో పాదరసాన్ని మందుగా వాడేవారు. వీటన్నిటికీ ఎంతో కొంత సూక్ష్మజీవులను చంపే లక్షణాలు ఉన్నాయి. కానీ అసలు కథ 1928 లండన్‌లో మొదలైంది. ఒక ఆసుపత్రిలోని పరిశోధన కేంద్రంలో ఒక శాస్త్రవేత్త స్టఫీలోకోకస్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తున్నారు. ఆయన కొన్ని రోజులు సెలవు తీసుకొని తిరిగి కేంద్రానికి వచ్చాక ఒక విచిత్రం చూశారు.
 
బ్రెడ్ ఎక్కువ రోజులు బయట వదిలేస్తే దానిపై పెరిగే ఒక రకమైన బూజు.. తాను పెంచుతున్న బ్యాక్టీరియా ప్లేట్‌లో పెరిగింది. ఆ బూజు చుట్టూ తాను పరిశోధన చేస్తున్న బ్యాక్టీరియా పెరగలేదు. అప్పుడు ఆ శాస్త్రవేత్త ఆ బూజుని తీసి రకరకాల బ్యాక్టీరియా ప్లేట్‌లలో పెంచారు. ఆశ్చర్యంగా ఆ బూజు పెరిగిన చోట ఎక్కడా బ్యాక్టీరియాలు పెరగలేదు. ఆ తరువాత మరో శాస్త్రవేత్తతో కలిసి పదేళ్ల పాటు కృషి చేసి ఆ బూజు విడుదల చేస్తున్న రసాయనాన్ని వేరు చేసి, శుద్ధి చేశారు. అదే మనందరికీ సుపరిచితమైన పెన్సిలిన్. దాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆ రసాయనానికి తన పేరు పెట్టుకోకుండా, ఆ రసాయనాన్ని విడుదల చేసిన బూజు (పెనిసిలియం నోటేటం) పేరే పెట్టారు. ఆయనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్.
 
ఆ రసాయనాన్ని శుద్ధి చేసి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయగలిగిన రోజు నుంచి ఈ రోజు వరకు పెన్సిలిన్ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. దెబ్బ తగిలినా, ఏ ఇన్ఫెక్షన్లు వచ్చినా ఆ తెల్ల మందు ఇంజెక్షన్ వేసేవారు. 1940ల నుంచి 1980ల వరకు ఈ యాంటీబయాటిక్స్(బ్యాక్టీరియాను అరికట్టే మందులు)కు స్వర్ణ యుగం నడిచిందని చెప్పుకోవచ్చు. స్ట్రెప్టోమైసిన్, క్లోరామ్ఫినికోల్, ఎరిథ్రోమైసిన్.. యాంటీ ఫంగల్స్, యాంటీ వైరల్స్.. ఇలా సూక్ష్మ జీవులను చంపే ఎన్నో రకాల మందులను ఆ కాలంలోనే కనిపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇన్ఫెక్షన్ల వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ యాంటీబయాటిక్స్ వాడకం వల్ల మరణాలు 20 నుంచి 30 శాతం తగ్గాయి.
 
అప్పటి నుంచి జబ్బు చేసినపుడు, ఆపరేషన్లు అయ్యాక, దెబ్బలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్లు సోకకుండా యాంటీబయాటిక్స్ వాడకం సాధారణమైపోయింది. ప్రాణనష్టం తగ్గింది. అయితే 1990ల నుంచి ఓ కొత్త పరిస్థితి ఎదురైంది. యాంటీబయాటిక్స్ ప్రభావం సూక్ష్మజీవులపై తగ్గింది. అవి యాంటీబయాటిక్స్ నిరోధక శక్తిని సంతరించుకున్నాయి. యాంటీబయాటిక్స్‌కి ఎక్స్‌పోజ్ అయిన ఈ సూక్ష్మజీవులు కొద్ది కాలం తర్వాత వాటికి లొంగకుండా మొండికేస్తాయి. ఇలా సూక్ష్మజీవులు రెసిస్టెన్స్‌ని సంతరించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నాయి. కొన్ని తమ జన్యువుల్లో మార్పులు (మ్యుటేషన్) చేసుకుంటే, కొన్ని జీన్ ట్రాన్స్‌ఫర్ అనే ప్రక్రియ ద్వారా నిరోధక శక్తిని సంతరించుకుంటున్నాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు మనం వాడే ఔషధాలను కూడా పనిచేయకుండా చేసేస్తాయి. దీనికి మంచి ఉదాహరణ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలినే.
 
స్టఫీలోకోకస్ సూక్ష్మజీవులు బీటా లాక్టమేస్ అనే ఒక ఎంజైమ్ తయారు చేసుకొని పెన్సిలిన్‌ను పనిచేయకుండా చేస్తాయి. టైఫాయిడ్ కలిగించే బ్యాక్టీరియాలు క్లోరామ్ఫెనికోల్ అనే మందుకు వ్యతిరేకంగా రసాయనాలు తయారు చేసుకున్నాయి. కొన్నైతే అమైనోగ్లాయ్కోసైడ్ జాతికి చెందిన యాంటీబయాటిక్స్‌ని ఎదుర్కొనే మందులు తయారు చేసుకున్నాయి. భారత్‌లో అందరూ గుర్తించే మంచి ఉదాహరణ - మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సీపారం సూక్ష్మజీవులు గతంలో క్లోరోక్విన్ మందు వేస్తే చనిపోయేవి. కానీ క్లోరోక్విన్ ఎక్కువగా వాడటం వలన ఫాల్సీపారం జీవులకు నిరోధక శక్తి వచ్చేసింది. మనం యాంటీబయాటిక్ వేస్తే అది సూక్ష్మజీవి లోపలికి పోరిన్స్ అనే ద్వారాల ద్వారా వెళ్లి దాన్ని చంపేస్తుంది. కానీ కొన్ని బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఆ మందును తమ లోపలికి వెళ్లనివ్వకుండా దారులన్నీ మూసేసుకుంటున్నాయి.
 
మరికొన్ని సూక్ష్మజీవులు ఒకవేళ యాంటీబయాటిక్ మందు లోపలికి వెళ్లినా… మళ్లీ దాన్ని బయటకు పంపించేలా కొత్త మార్గాలను వాటి కణాల్లో ఏర్పరచుకుంటున్నాయి. సుడోమోనాస్ అనే బ్యాక్టీరియా అన్ని రకాల యాంటీబయాటిక్స్‌కి రెసిస్టెన్స్‌ను ఏర్పరచుకుంది. క్షయ వ్యాధి ఎన్నో రకాల యాంటీబయాటిక్స్‌కి రెసిస్టెన్స్ చూపిస్తుంది. ఇలాంటివాటిని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అని, ఎక్స్‌ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ అని, సూపర్ బగ్స్ అని పిలుస్తారు.
 
ఈ పరిస్థితికి కారణాలేంటి?
దీనంతటికీ ముఖ్య కారణం మనం విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటమే. భారత్‌లో యాంటీబయాటిక్స్ కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం. అవి షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కిందకు వస్తాయి. కానీ చాలా మందుల దుకాణాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ అమ్మేస్తున్నారు. అది కూడా నిర్ణీత డోసుల్లో కాకుండా రోగి స్తోమతను బట్టి, ఫార్మసీలో ఉండే వ్యక్తి ఇష్టాన్ని బట్టి రెండు మూడు టాబ్లెట్లుగా అమ్ముతున్నారు.
 
1. ఎలాంటి రోగమైనా కూడా అది ఏ రకమైన యాంటీబయాటిక్‌కి లొంగుతుందో ముందే తెలుసుకొని కేవలం ఆ యాంటీబయాటిక్ మాత్రమే కచ్చితమైన డోసుల్లో వాడాల్సి ఉంటుంది. లేదంటే శరీరంలో రెసిస్టెంట్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
 
2. వైద్యుల్ని సంప్రదించే సౌకర్యం లేక లేదా వ్యాధిని సరిగ్గా పట్టించుకోక కొందరు మందుల దుకాణానికి వెళ్లి మందులు తెచ్చుకుంటారు. దాని వల్ల రోగికి సరైన యాంటీబయాటిక్స్ అందకుండా పోతున్నాయి. రోగ లక్షణాలు తెలుసుకోకుండా మందులు వేసుకోవడం వల్ల రోగం తగ్గకపోగా… రెసిస్టెంట్ బ్యాక్టీరియాలు తయారవుతున్నాయి.
 
3. గ్రామాలు, పట్టణాల్లోని కొందరు ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకు పరిమితం కాకుండా రకరకాల యాంటీబయాటిక్స్‌ని రోగులు వాడేలా చేస్తున్నారు. నోటి ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్ మాత్రమే కాదు… థర్డ్, ఫోర్త్ జనరేషన్ యాంటీబయాటిక్స్, రక్తంలోకి ఎక్కించే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. దానివల్ల రెసిస్టెంట్ బ్యాక్టీరియాలు పెరిగిపోతున్నాయి.
 
4. రోగానికి కారణం తెలుసుకోకుండా కేవలం లక్షణాలు తగ్గడానికి ఇచ్చే స్టెరాయిడ్ల వాడకం ఇటీవల పెరిగిపోయింది. దానివల్ల రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. యాంటీబయాటిక్‌లకు లొంగని ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. కోవిడ్ కాలంలో చూసిన బ్లాక్ ఫంగస్ ఈ కోవలోకే వస్తుంది.
 
5. జీవన శైలిలో మార్పుల వల్ల డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం భారత్‌లో పది కోట్లకు పైనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. శరీరంలో చక్కర శాతం అధికంగా ఉండడం వల్ల చక్కెరను ఇష్టపడే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అలాంటి వారికి రెసిస్టెంట్ బ్యాక్టీరియాలు గల ఇన్ఫెక్షన్ ఏదైనా సోకితే దానికి చికిత్స చేయడం చాలా కష్టం.
 
6. పశువులు/కోళ్లు బాగా పెరగడానికి వాడే వెటర్నరీ యాంటీబయాటిక్స్, సింథటిక్ గ్రోత్ ప్రమోటర్లు కూడా మన శరీరాల్లోకి చేరుతున్నాయి. వీటి వాడకంతో అనేక నష్టాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు వరకు కొలెస్టిన్ అనే యాంటీబయాటిక్‌ను (మనుషుల్లో కేవలం మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియాలకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు) కోళ్లు, పందులు, చేపలు బాగా పెరగడానికి ఉపయోగించేవారు. దానిని గ్రోత్ ప్రమోటర్‌గా వాడటాన్ని 2019లో ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ ఇంకా కొన్ని కోళ్ల ఫారాలలో యాంటీబయాటిక్‌లు, గ్రోత్ ప్రమోటర్లు వాడుతూనే ఉన్నారు.
 
7. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కనీసం 50 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. అందులో అధిక శాతం మరణాలు ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోనే నమోదవుతున్నాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ యాంటీబయాటిక్స్ సరిపడా అందుబాటులో లేకపోవడం లేదా ఎక్కువ ఖరీదు ఉండడం వల్ల కొందరు రోగులు రెండు లేదా మూడు టాబ్లెట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీనివల్ల రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అలాగని రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి ఉపయోగించే యాంటీబయాటిక్స్ కూడా తక్కువ ధరలో అందుబాటులో లేవు. వాటి ఖర్చు రోజుకి వేల రూపాయల్లో ఉంటుంది. అందువల్ల పేద మధ్యతరగతి దేశాలకు చెందిన రోగులు మరణాల బారిన పడాల్సి వస్తోంది.
 
ధనిక దేశాల్లో 10 ఏళ్లుగా అందుబాటులో ఉన్న బడాక్వెలిన్ అనే ఔషధం (డ్రగ్ రెసిస్టెంట్.. క్షయ వ్యాధికి ఎంతో ఉపయోగకరమైన మందు) భారత్‌లో మొన్నటి దాకా అందుబాటులో లేదు. రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను సైతం అంతమొందించే యాంటీబయాటిక్‌లను ధనిక దేశాలు రూపొందిస్తున్నా అవి పేద దేశాల వరకు అందడం లేదు. కొత్త యాంటీబయాటిక్‌లు కనుగొనడానికి ప్రభుత్వాలు గాని, ప్రైవేటు కంపెనీలు గాని చొరవ చూపడం లేదు. ఎందుకంటే అవి కనిపెట్టిన కొన్ని రోజులకే సూక్ష్మజీవులు రెసిస్టెన్స్‌ను సంతరించుకుంటున్నాయి.
 
మనం చేయగలిగింది ఏమిటి?
1. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీలో మందులు కొనేటప్పుడు అవి యాంటీబయాటిక్‌లా కాదా అని అడిగి తెలుసుకోవాలి. అవి యాంటీబయాటిక్ క్యాటగిరీకి చెందినట్లయితే వాటిని వద్దని చెప్పేయాలి.
 
2. వైద్యులు రాసే మందుల్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. వాటి పక్కన ఏదైనా ఒక చిన్న గుర్తు పెట్టమని అడగాలి. అలా గుర్తు పెట్టిన యాంటీబయాటిక్ టాబ్లెట్‌లను క్రమం తప్పకుండా, వైద్యులు ఎన్ని రోజులు సూచిస్తే అన్ని రోజులే వాడాలి.
 
3. కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా పొట్టలో అసిడిటీ వస్తుంది. అందువల్ల యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు యాంటాసిడ్ కూడా రాస్తుంటారు. అవి పరగడుపున వేసుకోవాలి. యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థలో లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల ఇవి చనిపోకుండా పెరుగు, మజ్జిగ అడ్డుకుంటాయి.
 
4. యాంటీబయాటిక్స్ నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం వాడకూడదు. ఒకసారి పని చేసింది కదా అని మళ్లీ మళ్లీ వాడకూడదు. అలా వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. పైగా కొన్ని యాంటీబయాటిక్స్ ఎక్కువకాలం వాడితే కిడ్నీలు, లివర్ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
 
5. ఒకరికి రాసిన మందులు మరొకరు అసలు వాడకూడదు. వైద్యులు రోగాన్ని బట్టి రోగి శరీరతత్వం, బరువు, ఆరోగ్య చరిత్ర, అలర్జీలను బట్టి మందులు రాస్తారు. అవే మందులు వేరే వాళ్లు వాడితే సమస్యలు ఎదురుకావచ్చు.
 
6. పెద్దవారి మందులు పిల్లలకు వాడకూడదు. అలాగే పిల్లల మందులు కూడా ఒకరివి ఇంకొకరికి వాడకూడదు. వారి కిడ్నీలు, కాలేయం చిన్నగా ఉంటాయి. అందువల్ల వారి బరువును బట్టి కచ్చితమైన డోసు అందించాల్సి ఉంటుంది.
 
7. హాస్పిటల్లో చేర్చుకోమని వైద్యులను ఒత్తిడి చేయకూడదు. ఆస్పత్రిలో హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (ఇతర రోగుల నుంచి ఇన్ఫెక్షన్లు సోకడం) వచ్చే ప్రమాదం ఉంటుంది. వీలైనంతవరకు నోటి ద్వారా వేసుకునే మందులు వాడాలి. ఇంజెక్షన్లు అవసరమైనప్పుడు.. వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
 
8. ఐసీయూలో పేషెంట్లను మాటిమాటికి వెళ్లి చూడకూడదు. అలా చేస్తే వారికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. రోగులను తాకే ముందు, తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
 
9. రద్దీగా ఉండే ప్రదేశాలకు, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మంచిది.
 
10. వ్యాధులు చాలా వరకు వైరస్‌ల వల్లే వస్తాయి, బ్యాక్టీరియాల వల్ల కాదు. ఇన్ఫెక్షన్‌లకు మనం యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు. కానీ జలుబు చేసినా, దగ్గు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా కూడా ఫార్మసీకి వెళ్లి యాంటీబయాటిక్స్ ఇవ్వండని కొందరు అడుగుతుంటారు. ఇది మంచిది కాదు.
 
11. ఏయే రోగాలకు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకొని, వైద్యుల సలహా మేరకు ఆ వ్యాక్సీన్‌లు వేసుకోవాలి. చిన్నపిల్లలకు షెడ్యూల్ ప్రకారం తప్పకుండా టీకాలు వేయించాలి. టీకాల వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందొచ్చు. ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత యాంటీబయాటిక్‌లు వేసుకునేకంటే అవి రాకుండా ముందే నివారించడం ఉత్తమం.
 
12. కేరళ ప్రభుత్వం ఆపరేషన్ అమృత్ పేరిట యాంటీబయాటిక్‌లు ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మడాన్ని పూర్తిగా నిషేధించింది. దీనిపైన ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి మార్పులు రావాలి.