శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: గురువారం, 16 మే 2019 (13:54 IST)

హాపూర్ రేప్ కేసు: ముగ్గురు భర్తలు... ముగ్గురు పిల్లలు...16 మంది అత్యాచార నిందితులు

20 ఏళ్ల గీత(పేరు మార్చాం)ను తీవ్రంగా కాలిన గాయాలతో దిల్లీలోని ఒక ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఏప్రిల్ 28న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కథ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నుంచి మురాదాబాద్ మీదుగా దిల్లీ చేరుతుంది.

ముగ్గురు భర్తలు...పది వేలకు ఒప్పందం.. ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు, తర్వాత ఆత్మహత్యాయత్నం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న గీత పరిస్థితి నిలకడగా ఉంది.
 
ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలోని శ్యాంపూర్‌జఠ్ గ్రామంలో ఉండే 20 ఏళ్ల గీత, తన ఫిర్యాదుపై హాపూర్ పోలీసులు ఎంతకీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో విసిగిపోయి ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ మొత్తం కేసు అనుమానాస్పదంగా ఉందని, దానిపై విచారణ చేపట్టామని హాపూర్ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఒక లేఖ రాశారు.
 
ఐదేళ్లుగా 16 మంది అత్యాచారం
ఈ కేసుపై వెంటనే విచారణ చేపట్టాలని స్వాతి మాలీవాల్ కోరారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా, నిందితులను అరెస్టయ్యేలా చూడాలని చెప్పారు. స్వాతి మాలీవాల్ పంపిన ఈ లేఖపై మే 11వ తేదీ ఉంది. ఆ తర్వాత రోజే అంటే మే 12న హాపూర్ బాబూగఢ్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 16 మందిని నిందితులుగా చెప్పారు. మే 13న జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసుపై స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి నివేదిక కోరింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. కానీ ఈ కథలో ఎన్నో కోణాలు, పాత్రలు ఉన్నాయి.
 
గీత ఎవరు, ఆమె శ్యాంపూర్‌జఠ్ ఎలా చేరుకుంది
హాపూర్ షాస్‌పురా గ్రామంలో ఉండే గీతకు 14 ఏళ్ల వయసులో మోనూ(పేరు మార్చాం)తో మొదటి పెళ్లి జరిగింది. కానీ వారు ఏడాది మాత్రమే కలిసి ఉన్నారు. గీత తన మొదటి కొడుకును తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కొంతకాలం తర్వాత మోనూ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత గీతను శ్యాంపూర్‌జఠ్‌లో ఉండే వినోద్(పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. పది వేల రూపాయలు తీసుకున్న తన తండ్రి రాం బలవంతంగా 33 ఏళ్ల వినోద్‌కు ఇచ్చి పెళ్లి చేశారని గీత ఆరోపించారు. అయితే గీత తండ్రి రాం, వినోద్ ఇద్దరూ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. వినోద్ బీబీసీతో మాట్లాడుతూ.. తను డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. రాం, ఆయన భార్య కూడా అదే చెప్పారు.
 
"నేను కూలీని, నెలకు ఆరు వేలు సంపాదించడమే కష్టం. పది వేలు ఎక్కడ్నుంచి తేగలను... ఆమెను పెళ్లి చేసుకోమని అడగడానికి వాళ్ల నాన్నే నా దగ్గరకు వచ్చారు" అని వినోద్ చెప్పాడు. కానీ బాబూగఢ్ పోలీస్ స్టేషన్‌లో గీత ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో వినోద్‌తో పద్ధతి ప్రకారం పెళ్లి జరగలేదని ఉంది. ఎఫ్ఐఆర్‌ను బట్టి ఇది ఒక ఒప్పందం. స్టాంప్ పేపర్‌పై జరిగింది. గీతను, ఆమె కొడుకుతోపాటు వినోద్‌కు అప్పగించారు.
 
అత్యాచారం ఆరోపణలు
ఎఫ్ఐఆర్‌లో 16 మంది అత్యాచార ఆరోపణల్లో నిందితులుగా ఉన్నారు. వీళ్లందరూ గత ఐదేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాశారని గీత ఆరోపించారు. గీత వాంగ్మూలం ప్రకారం వినోద్.. గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి డబ్బు అప్పు తీసుకున్నాడు. భార్యభర్తలు కలిసి ఎలాగోలా అసలు తీర్చారు, కానీ వడ్డీ మాత్రం మిగిలిపోయింది. వడ్డీ ఇవ్వాలనే ఒత్తిడితో ఆ వ్యక్తి గీతపై అత్యాచారం చేశాడు. భయపెట్టి, బెదిరించి చాలాసార్లు తన కోరిక తీర్చుకున్నాడు. దాంతో గీత గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
అయితే వినోద్ దాన్ని తోసిపుచ్చాడు. ఆ బిడ్డ తన కొడుకే అంటున్నాడు. గీత ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్‌లో ఘటనాస్థలం గురించి అత్యాచార ఘటనల గురించి చాలా వివరంగా చెప్పారు. ఎఫ్ఐఆర్‌ను బట్టి గీత ఇళ్లలో పనులు చేసేది. అదే సమయంలో చాలా మంది ఆమెపై అత్యాచారం చేశారు. చాలాసార్లు తనపై జరుగుతున్న ఘోరాల గురించి భర్త వినోద్‌కు చెప్పానని, కానీ ఆయన ప్రతిసారీ తనను ఊరుకోమనేవాడని, తన మాటలు పట్టించుకోలేదని గీత ఫిర్యాదు చేశారు.
 
అయితే "నాపై అలాంటి దారుణాలు జరుగుతున్నాయని గీత నాతో ఎప్పుడూ చెప్పలేదు" అని వినోద్ చెప్పాడు. బదులుగా గీతపైనే ఆరోపణలు చేశాడు. గీతదే తప్పని వినోద్ చెబుతున్నాడు. "లేదంటే మా గ్రామం వాడే అయిన భువన్(పేరు మార్చాం)తో ఎందుకు వెళ్లిపోతుంది, అది కూడా చిన్న చిన్న పిల్లల్ని నా దగ్గరే వదిలి" అన్నాడు. బీబీసీ భువన్‌తో మాట్లాడినప్పుడు అతడు "గీత మాట ఎవరూ వినడం లేదు, అందుకే నేను ఆమెకు తోడుగా ఉండాలనుకున్నాను" అన్నాడు.
 
మూడో భర్త, మురాదాబాద్
ఎఫ్ఐఆర్‌లో గీత భువన్‌ను ప్రస్తుతం తన భర్తగా చెబుతోంది. అంటే మూడో భర్త. అయితే గీత, వినోద్ విడాకులు తీసుకున్నారా? అదే ప్రశ్న మేం భువన్‌ను అడిగితే, వారు విడాకులు తీసుకోలేదని చెప్పారు. కానీ వినోద్‌తో ఉండడం తనకిష్టం లేదని ఒక పేపరుపై రాసిచ్చానని గీత చెబుతోంది. భువన్‌తో పెళ్లి విషయానికి వస్తే, స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి తాము పెళ్లి చేసుకున్నట్లు చెబుతోంది. తన కథ అంతా గీత తనకు చెప్పిందని, దాంతో ఆమెకు ఎవరున్నా, లేకపోయినా తను తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని భువన్‌ చెప్పాడు. కానీ మీరు గీతను తీసుకుని మురాదాబాద్ ఎందుకు వచ్చేశారు?
 
"గీత గురించి మా ఇంట్లో వాళ్లకు చెబితే, వాళ్లెవరూ ఒప్పుకోలేదు. సర్పంచ్ సాయం కూడా అడిగాను. ఇంకోవైపు ఆమెను చాలా మంది బెదిరిస్తున్నారు. దాంతో మేం గ్రామం వదిలి వెళ్లిపోవడమే మంచిదనుకున్నాం" అని భువన్ చెప్పాడు. మరో ఎఫ్ఐఆర్‌లో భువన్, గీత 2018 నవంబర్ 23 నుంచి మురాదాబాద్‌లో లివ్-ఇన్ రిలేషన్‌ షిప్‌లో ఉండేవారని ఉంది. ఇటు భువన్ తండ్రి మాత్రం గీతా, భువన్ గత ఏడాదిన్నరగా కలిసి ఉంటున్నారని చెప్పారు.
 
ఆత్మహత్యాయత్నం పోలీసుల వాంగ్మూలం
భువన్, గీత మురాదాబాద్‌లో కలిసి ఉండేవారు. గీత ముగ్గురు పిల్లలు వినోద్ దగ్గర శ్యాంపూర్‌జఠ్‌లో ఉండేవారు. గీత తనకు మొత్తం కథంతా చెప్పినపుడు, న్యాయం కోసం పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నామని భువన్ చెప్పాడు. "మేం చాలాసార్లు పోలీసులను కలవడానికి ప్రయత్నించాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. గత ఏడాది 2018 నవంబర్ 23 తర్వాత గీత ఏప్రిల్‌లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. కానీ పోలీసులు విచారణ తర్వాత చేస్తాం అన్నారు. దాంతో ఆమె చాలా బాధపడింది". దాంతో మానసికంగా కుంగిపోయిన గీత ఏప్రిల్ 28న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది" అని భువన్ చెప్పాడు.
 
దీనిపై మేం హాపూర్ జిల్లా ఎస్పీతో మాట్లాడాం. ఆయన పది వేల ఒప్పందానికి సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. పోలీసులు గీత చెబుతున్న వేర్వేరు అత్యాచార ఘటనలపై కూడా విచారణ చేపట్టారు. కానీ వాటిలో దేనికీ ఆధారాలు దొరకలేదు. ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనే గీత ఆరోపణలు నిజమా, కాదా అని మేం ఎస్పీని అఢిగినప్పుడు ఆయన "ఇంతకు ముందు గీతపై కూడా ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. స్వయంగా గీత కూడా వేర్వేరు వ్యక్తుల గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. కానీ విచారణ తర్వాత రెండు వైపులా చెప్పింది అబద్ధంగా తేలింది" అన్నారు. అయితే ఆయన ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని, ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
 
గ్రామస్థుల స్పందన
మేం శ్యాంపూర్‌జఠ్ చేరుకున్న సమయానికి ఆ ఊరు దాదాపు ఖాళీగా ఉంది. ఒక దగ్గర కొంతమంది కనిపించారు. వారితో మేం గీతా-వినోద్-భువన్ గురించి అడిగాం. వాళ్లు మొదట్లో మాట్లాడ్డానికి నిరాకరించారు. తర్వాత పేరు రహస్యంగా ఉంచుతామని చెప్పడంతో మాట్లాడారు. అక్కడ గ్రామంలోని కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్లు మొత్తం తప్పు గీతదే అన్నారు. వారిలో గీత కేసు పెట్టిన పురుషుల ఇళ్లలోని మహిళలు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్‌లో ఉన్న పేర్లన్నీ తప్పని చెప్పారు. డబ్బుల కోసమ గీత ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం కేసులో ఇప్పటికీ పరిష్కారం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి.
 
కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటే... బంధం, సమాజం, చట్టం మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది?