శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2024 (13:59 IST)

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

ship
ఆంధ్రప్రదేశ్‌‌లోని కాకినాడ జిల్లా కేంద్రంలోని ఓడ రేవు నుంచి పెద్దమొత్తంలో పేదల రేషన్‌ బియ్యం తరలింపు వ్యవహారం అలజడి రేపింది. కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు. మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
సముద్రంలో గంటసేపు ప్రయాణించి..
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్‌) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం వచ్చింది. వెంటనే ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్‌ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం అని గుర్తించారు. నౌకలోని ఐదు కంపార్ట్‌మెంట్లలో ఉన్న బియ్యం నమూనాలను అక్కడికక్కడే రసాయనాలతో పరీక్షించారు.
 
ఆ బియ్యం ఎక్కడివంటే..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రెండు నెలల కిందట జరిపిన తనిఖీల్లో సీజ్‌ చేసిన బియ్యాన్ని ఇటీవల బ్యాంకు గ్యారెంటీతో విడుదల చేశారు. ఇప్పుడు పట్టుకున్న బియ్యం నిల్వలు అప్పటివేనా? లేదా లెక్కలోకి ఎక్కని వేరే నిల్వలా? అనేది పరిశీలిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. నౌకలో ఉన్న 640 టన్నుల బియ్యానికి సంబంధించి 22 ఎగుమతి కంపెనీల రశీదులు ఉన్నాయని ఆయన చెప్పారు. బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యం మరో రెండు కంపెనీలకు చెందినదిగా ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్‌ వివరించారు.
 
ఇంకా సీజ్‌ చేయలేదు: జిల్లా కలెక్టర్‌
''పట్టుబడిన బియ్యం ఇంకా సీజ్‌ చేయలేదు. ఆ బియ్యం రశీదులు తనిఖీ చేస్తున్నాం. తనిఖీలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటాం'' అని జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ బీబీసీతో చెప్పారు.
 
'పేదల బియ్యం స్మగ్లింగ్‌ కేంద్రంగా కాకినాడ'
పేదల బియ్యం స్మగ్లింగ్‌‌కు కాకినాడ కేంద్రంగా మారినట్లు తమ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే గుర్తించామని, అందుకే అక్కడి బియ్యం రవాణా కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ బీబీసీతో చెప్పారు. జిల్లా కలెక్టర్‌ బియ్యం ఈ విషయం తన దృష్టికి తీసుకురావడంతో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కాకినాడ పోర్టులో ఇకపై కూడా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు. ''అక్కడ చిన్న జలమార్గంలోనే ఓ బార్జ్ ఉంచి.. అక్కడి నుంచే బియ్యం బస్తాలు లోడ్ చేసి షిప్‌ వద్దకు తీసుకెళ్తున్నారు. పోర్టు నుంచి లోడింగ్‌ జరగడం లేదు. అంటే, గతంలో ఏ స్ఖాయిలో బియ్యం అక్రమ రవాణా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. బియ్యం స్మగ్లింగ్‌పై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం'' అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.