ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: జగన్ తొలి బడ్జెట్‌లో 30 ముఖ్యాంశాలు

Jaganmohan Reddy
Last Updated: శుక్రవారం, 12 జులై 2019 (19:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 2,27,974.99 కోట్లు అంచనా వ్యయంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం నాడు శాసనసభకు బడ్జెట్‌ను సమర్పించారు.
జగన్ విస్తృతంగా ప్రచారం చేసిన నవరత్నాలు సహా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు చాలా వరకూ ఈ బడ్జెట్‌లో చోటు సంపాదించుకున్నాయి. బడ్జెట్‌లో 30 ముఖ్యమైన అంశాలివీ...

కృష్ణా, గోదావరి ఆయకట్టులను స్థిరీకరించటం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటం కోసం.. 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. అందుకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయిస్తాం.
జగనన్న అమ్మ ఒడి పథకం కింద.. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న పిల్లల తల్లికి రూ. 15,000 అందిస్తాం. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 6,455 కోట్లు కేటాయించాం.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రవేశపెడుతాం. తెలుగు భాషను కాపాడటానికి తెలుగు పాఠ్యాంశం తప్పనిసరి చేస్తాం.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా.. అన్ని కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు మెట్రిక్ అనంతర కోర్సులకు నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తాం. ఇతర ఖర్చుల నిమిత్తం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 20,000 చొప్పున అందిస్తాం.
వైఎస్ఆర్ బీమా కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వ్యక్తి ఎవరైనా సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 1 లక్ష సహాయం అందిస్తాం. ఎవరైనా ప్రమాద వశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షలు సహాయం అందిస్తాం.

వార్షిక ఆదాయం రూ. 5,00,000 కన్నా తక్కువ ఉన్న కుటుంబాలన్నిటికీ.. రూ. 1,000 కి మించి వైద్య ఖర్చులయ్యే అన్ని కేసులకూ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది.

రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యం. ఇందుకోసం అవసరమైతే ప్రైవేటు భూములనూ తీసుకుంటాం. ఈ స్థలాలలో ఇళ్లను పేదలు భవిష్యత్ అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు.
ప్రభుత్వ ఆస్పత్రులను రెండేళ్లలో ఉత్తమ కార్పొరేట్ ఆస్పత్రులతో సమానంగా అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం రూ. 1,500 కోట్లు కేటాయిస్తున్నాం.

షెడ్యూల్డు కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉప ప్రణాళిక కింద రూ. 15,000 కోట్లు, షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక కింద రూ. 4,988 కోట్లు కేటాయింపులు చేశాం. అలాగే బీసీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 15,061 కోట్లు కేటాయిస్తున్నాం.

వెనుకబడిన తరగతుల (బీసీ) వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక అందిస్తాం. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ వధువులకు రూ. 1,00,000 చొప్పున కల్యాణ కానుక అందజేస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 81 వేల యువ వలంటీర్లను నియమిస్తాం. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ఇంటి ముంగిటకు అందించే కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తాం.

దశల వారీ మద్యనిషేధం హామీ అమలులో భాగంగా మొదట బెల్టు షాపులపై కఠిన చర్యలు ప్రారంభించాం. తరువాతి చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలుగా మార్పు చేస్తాం.
వెనుకబడిన తరగతుల కోసం 139 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. వీటి ద్వారా వివిధ బీసీ ఉప సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు వచ్చే సంవత్సరం నుండి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేస్తాం.

కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. 2,000 కోట్లు కేటాయిస్తున్నాం.

బ్రాహ్మణుల కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా సంఖ్యను బట్టి ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ. 234 కోట్లు కేటాయిస్తున్నాం.
ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 10,000 కు, మౌజామ్‌ల గౌరవ వేతనాన్ని రూ. 5,000 కు పెంచాలని ప్రతిపాదిస్తున్నాం. పాస్టర్లకు కూడా నెలకు రూ. 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం.

బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీల రాజకీయ అభ్యున్నతి కోసం.. దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డు కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించటానికి బిల్లు తీసుకువస్తాం.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించటానికి రూ. 1,150 కోట్లు కేటాయిస్తున్నాం.

సవివర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఓఆర్ఎస్ సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రవేశపెడతాం. భవిష్యత్తులో భూయజమానులు జియో-కోడ్స్ ఉపయోగిస్తూ తమ భూమిని సొంతంగా గుర్తించగలరు.

అమరావతి రాజధాని నగరం కోసం రూ. 500 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తూ ప్రతిపాదించాం.

కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సీఎం ఈ ఏడాది శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంటు కోసం బడ్జెట్‌లో మొదట రూ. 250 కోట్లు కేటాయిస్తున్నాం.
2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెండింతలు పెంచటం లక్ష్యం. ప్ర‌తీ రైతుకి పంట‌కాలానికి ముందే రూ. 12,500 ఇస్తామ‌న్న హామీని ఈ ఏడాది అక్టోబ‌ర్ 15 నుంచే అందిస్తున్నాం. రూ. 8,750 కోట్ల కేటాయింపుతో కౌలురైతులు స‌హా అంద‌రికీ ల‌బ్ధిచేకూరుస్తున్నాం.

వైఎస్సార్ ఫ‌స‌ల్ బీమా పథకం కింద.. రైతుల పంట బీమా వాటాను ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. రూ. 1,163 కోట్ల‌తో రైతుల‌కు మేలు క‌లుగుతుంది.
వ్యవసాయ ఉత్పత్తుల ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ కోసం రూ. 3,000 కోట్లతో నిధిని కేటాయిస్తున్నాం. సాగు న‌ష్ట నివార‌ణ కోసం ప్ర‌కృతి విపత్తు నిధికి రూ. 2,000 కోట్లు కేటాయించాం.

ఆత్మహత్య, ప్రమాదాల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందిస్తాం.

ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకునే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ సమకూర్చటానికి బిల్లు తీసుకువస్తాం.
ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రమే ఇసుకను విక్రయించటం జరుగుతుంది. ఈ విధానం ఆన్‌లైన్‌ ద్వారా అమలవుతుంది.

విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన అన్ని హామీలు కేంద్రం, పార్ల‌మెంట్ అమ‌లు చేయాలి. ప్ర‌త్యేక హోదా కోసం ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నిస్తున్నారు.

భారీ కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపడుతున్నాం. హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం.
ఈ ప్రభుత్వానికి కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. పార్టీలు అసలే లేవు. 'అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి' మా నినాదం.

దీనిపై మరింత చదవండి :