బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 జులై 2022 (22:48 IST)

కార్గిల్ యుద్ధం: వీరోచితంగా పోరాడిన పాక్ సైనికుడు.. భారత్ సిఫార్సుపై అత్యున్నత శౌర్య పురస్కారం ఇచ్చిన పాకిస్తాన్

Sher Khan
ఓ సైనికుడి ధైర్యాన్ని గుర్తించి, ఆతని వీరత్వాన్ని గౌరవించాలని అతని అధికారులకు శత్రు సైన్యం చెప్పడం చాలా అరుదు. 1999 కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ సరిహద్దులో పాకిస్తానీ కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ చూపిన ధైర్యసాహసాలతో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ యుద్ధానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ ఎంఎస్ బాజ్వా అప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. "ఈ పోరాటం ముగిసిన తర్వాత కూడా నేను ఆ అధికారిని మరచిపోలేకపోయాను. నేను 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కానీ, ఒక పాకిస్తానీ ఆఫీసర్ ట్రాక్ సూట్ ధరించి ముందు నిలబడి నాయకత్వం వహించడం నేనెప్పుడూ చూడలేదు. మిగతా సైనికులు కుర్తా పైజామాల్లో ఉంటే ఇతను మాత్రం ట్రాక్ సూట్ ధరించి ఉన్నాడు."

 
ఆ పాకిస్తానీ సైనికుడి ప్రయత్నం ఆత్మహత్యా సదృశం
కార్గిల్ పైన రచనా బిష్ట్ రావత్ రాసిన "కార్గిల్ - అన్‌టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ ది వార్" అనే పుస్తకంలో ఇలా అన్నారు.. "కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ ఉత్తర పదాతిదళానికి చెందినవారు." "టైగర్ హిల్ పైన వాళ్లు ఐదు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. మొదట 8 మందికి వాటిని స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. తర్వాత వారితోపాటు మరో 18 మంది గ్రెనేడియర్స్ కలిసి ప్రయత్నించగా, ఒక స్థావరాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, శత్రు శిబిరంలోని కెప్టెన్ షేర్ ఖాన్ ఎదురు దాడి చేశారు." మొదటి ప్రయత్నంలో విఫలమైనా, తన సైనికులను కూడగట్టి రెండోసారి ప్రతిఘటించారు. ఈ యుద్ధాన్ని అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న వారికి ఆ పాకిస్తానీ సైనికుడి ప్రయత్నం ఆత్మహత్యా సదృశంగా తోచింది. ఎందుకంటే భారతీయ సైనికుల సంఖ్య వారికంటే చాలా ఎక్కువగా ఉంది.

 
జేబులో చీటీ
"షేర్ ఖాన్ ఆజానుబాహుడు. చాలా ధైర్యంగా పోరాడాడు. చివరికి, అక్కడే పక్కనే గాయపడి ఉన్న కృపాల్ సింగ్ అనే మన సైనికుడు పది గజాల దూరం నుంచి అతనిపై దూకి పడగొట్టాడు" అని ఆరోజు జరిగిన ఘటనను బ్రిగేడియర్ ఎంపీఎస్ బాజ్వా జ్ఞాపకం చేసుకున్నారు. షేర్ ఖాన్ మరణంతో వారి దాడి ఆగిపోయింది. "మేము అక్కడ 30 మంది పాకిస్థానీల శవాలను ఖననం చేశాం. కానీ, నేను కొందరు కూలీలను పంపించి కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ మృత దేహాన్ని కిందికి తెప్పించి బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌లో భద్రపరిచా", అని బాజ్వా అన్నారు.

 
బ్రిగేడియర్ బాజ్వా కెప్టెన్ షేర్ ఖాన్ మృతదేహాన్ని అప్పగించేటప్పుడు, "12 ఎన్ఎల్ఐకి చెందిన కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ చాలా ధైర్యంగా పోరాడారు. ఆయనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కాలి" అని ఓ చీటీమీద రాసి మృతదేహానికి వేసిన దుస్తుల జేబులో ఉంచారు. కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జన్మించాడు. అతని తాత 1948 కశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు యూనిఫాం ధరించిన సైనికులంటే ఇష్టం. అందుకే, తన మనవడికి ఆయన కల్నల్ షేర్ ఖాన్ అని పేరు పెట్టారు. ఈ పేరు తన మనవడికి ఎన్ని కష్టాలు తెస్తుందో ఆ తాతకి అప్పట్లో తెలియదు!

 
"విట్నెస్ టు బ్లండర్ - కార్గిల్ స్టోరీ అన్ఫోల్డ్స్" అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన కల్నల్ అష్ఫాక్ హుస్సేన్ ఇలా అంటారు.. "షేర్ ఖాన్ పేరులో సగ భాగం కల్నల్. దాన్ని అతను చాలా గర్వంగా భావించేవాడు. కానీ కొన్నిసార్లు ఇది అతడికి సమస్యలను కూడా సృష్టించింది. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు 'లెఫ్టినెంట్ కల్నల్ షేర్‌ను మాట్లాడుతున్నా' అని సమాధానం చెప్పినప్పుడు, అవతలి వ్యక్తి... తాను ఎవరో ఉన్నతాధికారితో మాట్లాడుతున్నానని భావించి 'సర్' అని సంబోధించేవారు. దానికి అతడు నవ్వి, 'ఇప్పుడే కమాండింగ్ ఆఫీసర్‌కు కలుపుతాను' అని చెప్పాల్సి వచ్చేది."

 
ఆయనంటే అందరికీ ఇష్టమే
కల్నల్ షేర్ 1992 అక్టోబర్‌లో పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. అప్పట్లో ఆయనకు గడ్డం ఉండేది. శిక్షణకు ముందు అధికారులు గడ్డం తీసేయమని చెప్పారు, కానీ షేర్ దానికి ఒప్పుకోలేదు. శిక్షణ ముగిసే సమయంలో, 'మీ పనితీరు బాగుంది. మీరు గడ్డం కత్తిరించుకుంటే, మీకు కోరుకున్న మంచి ఉద్యోగం దక్కుతుంది' అని అధికారులు చెప్పారు. అయినా సరే దానికి ఆయన నిరాకరించారు. కానీ, ఆయనను బెటాలియన్ క్వార్టర్ మాస్టర్‌గా ఉద్యోగంలో చేర్చుకున్నారు. "పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలోని సీనియర్లు తరచూ ర్యాగింగ్ పేరుతో జూనియర్లను దూషిస్తూ ఉండేవారు. కానీ షేర్ ఖాన్ నోటి నుంచి నేనెప్పుడూ చెడు మాటలు వినలేదు. అతని ఇంగ్లిష్ చాలా బాగుంటుంది. అతను ఇతర అధికారులతో 'స్క్రాబుల్' ఆట ఆడేవాడు, ఎన్నోసార్లు గెలిచేవాడు కూడా. వాళ్లందరితో కలిసిమెలిసి ఉంటూ సరదాగా లూడో ఆడేవారు" అని ఆ జూనియర్లలో ఒకరైన కెప్టెన్ అలివుల్ హస్నైన్ తెలిపారు.

 
అధికారుల ఆదేశంతో వెనక్కి...
1998 జనవరిలో షేర్ ఖాన్‌ను డోమెల్ సెక్టార్లో నియమించారు. భారతీయ సైనికులు వెనక్కి వెళ్లినపుడు వీరంతా కలసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. శిఖరంపైకి చేరుకున్నామని కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ తమ అధికారులకు తెలిపారు. వారి నుంచి అనుమతి రాగానే తమ ఆపరేషన్ ప్రారంభించాలనుకున్నారు. "సందిగ్ధంలో పడ్డ ఈ కమాండింగ్ ఆఫీసర్ ఏం చేశారు? భారత స్థావరాన్ని ఆక్రమించుకోవడానికి అనుమతిని కోరుతూ ఉన్నతాధికారులకు సమాచారం పంపించారు. కానీ అధికారులు దానికి అనుమతించలేదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, వెనక్కి రమ్మని షేర్‌ను ఆదేశించారు. నిరాశతో వెనుదిరిగినా, వస్తూ వస్తూ, అక్కడే ఉన్న భారత సైనికులకు చెందిన కొన్ని గ్రెనేడ్లు, వారి యూనిఫాంలు, వైకర్ తుపాకీ మేగజీన్, తూటాలు, నిద్రకు ఉపయోగించే కొన్ని బ్యాగులను కూడా తీసుకెళ్లారు" అని తన పుస్తకం "విట్నెస్ టు బ్లండర్ - కార్గిల్ స్టోరీ అన్‌ఫోల్డ్స్"లో కల్నల్ అష్ఫాక్ హుస్సేన్ రాశారు.

 
టైగర్ హిల్‌పై చివరి క్షణాలు...
కెప్టెన్ షేర్ ఖాన్‌ను 1999 జులై 4న టైగర్ హిల్‌కు వెళ్లమని ఆదేశాలొచ్చాయి. అక్కడ పాకిస్తాన్ సైనికులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వాటికి కోడ్ 129 ఏ, బీ, సీ అని పేర్లు పెట్టారు. వాటినే కలీమ్, కాశిఫ్, కలీమ్ పోస్ట్ అని కూడా పిలిచేవారు. అయితే, భారత సైన్యం 129 ఏ, బీ లను వేరుచేయడంలో సఫలమైంది. కెప్టెన్ షేర్ సాయంత్రం 6 గంటలకు ఆ ప్రదేశానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించిన తరువాత, తర్వాత రోజు ఉదయం భారత సైనికులపై దాడి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

 
"రాత్రి ఆయన సైనికులందరిని ఓ చోటకు పిలిచి.. దేశంకోసం త్యాగం చేసే అదృష్టం అందరికీ రాదంటూ వారిలో చైతన్యాన్ని నింపారు. ఉదయం 5 గంటలకు నమాజ్ చదివిన తర్వాత, కెప్టెన్ ఉమర్‌తో కలిసి దాడి చేయడానికి బయలుదేరారు. మేజర్ హషీమ్‌తో కలిసి కెప్టెన్ ఉమర్ 129 బీ పైన ఉన్న సమయంలోనే భారత సేనలు వారిపై ఎదురుదాడి చేశాయి", అని కల్నల్ అష్ఫాక్ హుస్సేన్ తన పుస్తకంలో వివరించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తమ ఆయుధాలతో తమపైనే దాడిచేయమని మేజర్ హషీమ్ తమ సేనలను ఆదేశించారు. శత్రు సైనికులు చాలా దగ్గరగా వచ్చినప్పుడు, దళాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాయి.

 
"మా ఫిరంగి గుళ్లు మాకు నాలుగు వైపులా పడుతున్నాయి. పాకిస్తాన్, భారత సైనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఇంతలో ఓ భారతీయ సైనికుడు తీవ్రంగా దాడిచేయడంతో కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ కింద పడిపోయారు. ఇతర పాకిస్తానీ సైనికులతో పాటు షేర్ కూడా యుద్ధంలో మరణించారు" అని కల్నల్ అష్రాఫ్ తన పుస్తకంలో తెలిపారు. మిగతా పాకిస్తానీ సైనికుల మృతదేహాలను భారతీయ సేనలు అక్కడే ఖననం చేశాయి. కానీ షేర్ ఖాన్ మృతదేహాన్ని మాత్రం ముందు శ్రీనగర్, తర్వాత దిల్లీ తీసుకొచ్చారు.

 
మరణానంతరం 'నిషాన్-ఏ-హైదర్' పురస్కారం
"నేను అతని మృతదేహాన్ని కిందికి తెప్పించి, తరువాత తిరిగి పాకిస్తాన్ పంపించకపోతే, అతని పేరు ఎక్కడా ఉండేది కాదు. అతనికి మరణానంతరం నిషాన్-ఏ-హైదర్ అవార్డు ఇచ్చారు. ఇది పాకిస్తాన్‌లో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం. మన పరమవీరచక్రతో సమానం" అని బ్రిగేడియర్ బాజ్వా వివరించారు. తరువాత, షేర్ ఖాన్ సోదరుడు అజ్మల్ షేర్ ఓ ప్రకటన చేశారు, "అల్లాకు ధన్యవాదాలు. మన శత్రువు చాలా ధైర్యవంతుడు. భారతీయులు పిరికివారు అంటే నేను ఒప్పుకోను. అలాంటివారే, కల్నల్ షేర్ ఖాన్ ఓ హీరో అని ఒప్పుకున్నారు" అని.

 
అంతిమ వీడ్కోలు
1999 జులై 18... కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ మృతదేహాన్ని చివరిసారి చూడాలని అర్ధరాత్రి తర్వాత మాలిర్ గారిసన్ నుంచి వందలాది సైనికులు కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన పూర్వీకుల గ్రామం నుంచి ఇద్దరు సోదరులు కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. "ఉదయం 5 గంటలకు విమానం రన్‌వేపై దిగింది. వెనక భాగం నుంచి రెండు శవపేటికలు దించారు. అందులో ఒకటి షేర్ ఖాన్ పార్థివ శరీరం కాగా, రెండోది ఎవరిదో ఇప్పటివరకు గుర్తించలేదు" అని కల్నల్ అష్రాఫ్ రాశారు.

 
ఆ శవపేటికలను అంబులెన్స్‌లో ఉంచి వేలాది మంది సైనికులు, సాధారణ పౌరులు ఎదురుచూస్తున్న ప్రదేశానికి తీసుకెళ్లారు. బలూచ్ రెజిమెంట్‌కు చెందిన యువ సైనికులు అంబులెన్స్ నుంచి శవపేటికను బయటకు దించి ప్రజలకు కనబడేలా మధ్యలో నేలమీద ఉంచారు. ఒక ఖాతీబ్.. నమాజ్-జనాజా చదివారు. నమాజ్ తర్వాత శవపేటికలను పాకిస్తాన్ వాయుసేన విమానంలో ఉంచారు. కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ పార్థివ శరీరాన్ని కోర్ కమాండర్ ముజఫర్ హుసేన్ ఉస్మానీ, సింధ్ గవర్నర్ మామున్ హుసేన్, పార్లమెంట్ సభ్యుడు హలీమ్ సిద్ధిఖీ తమ భుజాలపై మోశారు. అక్కడి నుంచి విమానం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అక్కడ మరోసారి నమాజ్-జనాజా చదివి ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడు రఫీక్ తారార్ కూడా అక్కడే ఉన్నారు. ఆ తరువాత కెప్టెన్ షేర్ మృతదేహాన్ని అతని పూర్వీకుల గ్రామానికి తీసుకెళ్లారు. ధైర్యవంతుడైన ఈ పాకిస్తానీ సైనికుడికి వేలాదిమంది తుది వీడ్కోలు పలికారు.