గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2024 (13:46 IST)

కోల్‌కతా రేప్ కేస్: ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి ఏం జరిగింది?

rape
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు చేపట్టిన ఆందోళన హింసకు దారి తీసింది. ఆగస్ట్ 14 రాత్రి పొద్దుపోయాక కొందరు వ్యక్తులు ఆర్‌జీ కర్ ఆసుపత్రి దగ్గర విధ్వంసానికి దిగారు. వైద్యులు నిరసన తెలుపుతుండగా, గుర్తు తెలియని ఒక గుంపు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన జరుగుతున్న ప్రాంతంలో వాహనాలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. రాత్రి పొద్దుపోయాక ఆ గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ అన్నారు.
 
ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో గూండాయిజం, విధ్వంసం అన్ని పరిమితులనూ దాటిపోయిందని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. హింసకు పాల్పడిన వారిని 24 గంటల్లో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలేనని రాష్ట్ర ప్రతిపక్ష నేత సుభేందు అధికారి ఆరోపించారు.
 
హింసాత్మక ఘటనలపై కోల్‌కతా పోలీసులు ఏం చెప్పారు?
హింసాకాండ అనంతరం కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇక్కడ ఏం జరిగినా మీడియా తప్పుడు ప్రచారం వల్లే జరిగింది. ఇది కొందరు కావాలని చేస్తున్న మీడియా ప్రచారం. కోల్‌కతా పోలీసుల వైఫల్యం ఎక్కడుందో చెప్పండి? ఈ కేసులో కోల్‌కతా పోలీసులు చేయగలిగిందంతా చేశారు. మేం బాధిత కుటుంబాన్ని ఓదార్చడానికి, మద్దతుగా నిలవడానికి ప్రయత్నించాం. కానీ వదంతులు వేగంగా వ్యాపించడం మొదలయింది’’ అని ఆయన అన్నారు.
 
"మేము ఎలాంటి తప్పూ చేయలేదు. కానీ ఈ ప్రమాదకరమైన మీడియా ప్రచారం కారణంగా, కోల్‌కతా పోలీసులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కేసులో ఒకే ఒక్క నిందితుడు మాత్రమే ఉన్నాడని మేమెప్పుడూ చెప్పలేదు. శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని.. ఇందుకు కాస్త సమయం పడుతుందని మాత్రమే చెప్పాం’’ అని ఆయన అన్నారు. ‘‘మేం చేసినవన్నీ సరైనవే అన్న విషయంలో నాకెలాంటి సందేహం లేదు. ఇప్పుడీ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వాళ్లు నిష్పక్షపాత విచారణ జరుపుతారు. మేం సీబీఐకి పూర్తిస్థాయిలో సహకరిస్తాం’’ అని ఆయన చెప్పారు.
 
రాత్రి పొద్దుపోయాక ఏం జరిగింది?
ఆర్‌జీ కర్ ఆసుపత్రి దగ్గర నిరసన ప్రదర్శన జరిగినప్పుడు బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి అక్కడే ఉన్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిపై దాడిచేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ఆయన చెప్పారు. ఆ సమయంలో చాలామంది మీడియా సిబ్బందిని కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని, కెమెరా పర్సన్లపై దాడి జరిగిందని ఆయన వెల్లడించారు. ‘‘అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు. కొంతమంది జర్నలిస్టులు చాలాసేపు ఆసుపత్రి లోపలే చిక్కుకుపోయారు’’ అని ఆయన వివరించారు.
 
ఆసుపత్రి వద్ద విధ్వంసం పెద్ద ఎత్తున జరిగినట్టు, ఆవరణలో పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు సంఘటనా స్థలంలో తీసిన వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తోంది. హింసాత్మక ఘటనల తర్వాత, ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైద్యులు ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘‘ఆర్‌జీ కర్ ఘటనపై కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నాం. రాత్రి 11 గంటలకు మహిళలందరూ కలిసి మార్చ్ నిర్వహిస్తున్నారు. మహిళా వైద్యులందరూ శాంతియుతంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. అకస్మాత్తుగా బయట పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు ఆ గుంపును ఆపలేకపోయారు. వాళ్లంతా ఒక్కసారిగా లోపలికి వచ్చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి మేం పరుగులు తీశాం. ఎదురుగా వచ్చిన వాళ్లపై వాళ్లు దాడి చేస్తున్నారు. వైద్యులు చాలామంది గాయపడ్డారు. మహిళలపై కూడా ఆ గుంపు దాడి చేసింది’’ అని అందులో వెల్లడించారు.
 
నిరసన స్థలంలో ఉన్న వేదిక, కుర్చీలు, ఫ్యాన్లను కూడా దుండగులు ధ్వంసం చేశారని వైద్యులు తెలిపారు. వివిధ వార్డుల్లోకి, మహిళా హాస్టళ్లలోకి కూడా గుంపు ప్రవేశించిందని వారు చెప్పారు. ‘‘మమ్మల్ని రక్షించమని మేం పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఎన్ని దాడులు చేసినా మా నిరసన ఆగదు’’ అని అందులో పాల్గొన్న డాక్టర్లు స్పష్టం చేశారు.
 
హింస మీద రాజకీయం
ఆర్‌జీ కర్ ఆస్పత్రిపై దాడిని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తప్పుపట్టారు. ఈ ఘటనతో గూండాయిజం, అనాగరికత అన్ని హద్దులూ దాటిందని ఆరోపించారు. "ఒక ప్రజాప్రతినిధిగా, నేను కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తో ఇప్పుడే మాట్లాడాను. వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారన్న దానితో సంబంధం లేకుండా ఈ హింసకు కారణమైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకురావాలని కోరాను" అని ఆయన ట్వీట్ చేశారు.
నిరసన చేస్తున్న డాక్టర్ల డిమాండ్లు న్యాయబద్ధమైనవని అభిషేక్ బెనర్జీ అన్నారు. ప్రభుత్వం నుంచి వాళ్లు ఆశిస్తున్నవి చాలా ప్రాథమికమైన అవసరాలు. వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని ఆయన అన్నారు.
 
ఆస్పత్రి దగ్గర ప్రదర్శన చేస్తున్నవారిపైకి మమతా బెనర్జీ తమ టీఎంసీ గూండాలను పంపారని బీజేపీ నాయకుడు సుభేందు అధికారి ఆరోపించారు. తాను ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తినని మమత అనుకుంటారని సుభేందు విమర్శించారు. విధ్వంసకారులు సురక్షితంగా ఆస్పత్రి ప్రాగంణంలోకి వచ్చే వీలు పోలీసులు కల్పించారని ఆయన అన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న ముఖ్యమైన ఆధారాలను దుండగుల గుంపు ధ్వంసం చేసిందని, సీబీఐ ఈ సాక్ష్యాలన్నింటినీ సేకరించలేదని ఆయన అన్నారు.
 
దేశవ్యాప్తంగా నిరసనలు
కోల్‌కతాలో మెడికల్ విద్యార్థిని అత్యాచారం, హత్యకు నిరసనగా హైదరాబాద్, దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
పలువురు డాక్టర్లు, ముఖ్యంగా మహిళా వైద్యులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొని, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చేతిలో కాగడాలు, బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టిన మహిళలు బుధవారం రాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘‘మాకు అందరి నుంచి సంఘీభావం లభిస్తోంది. కోల్‌కతా నగరంలో ఇంత పెద్ద ప్రదర్శన, అందులో రాత్రి పూట ఎప్పుడూ జరగలేదు. మా నినాదాలు అధికారులను మేల్కొలుపుతాయని మేం భావిస్తున్నాం’’ అని ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న చైతాలీ సేన్ అన్నారు.
 
హైదరాబాద్‌లోనూ...
బుధవారం రాత్రి 11గంటల నుంచి 12.30 గంటల వరకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ప్రదర్శన కొనసాగింది. దీనికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, వైద్య విద్యార్థినులు, మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు పురుషులు కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.