ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (15:51 IST)

నూపుర్ శర్మ: మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు భారత్ క్షమాపణ చెప్పాలన్న ఖతర్.. భారత్ ఏమని బదులిచ్చిందంటే..?

Nupur sharma
కర్టెసి-ట్విట్టర్
మొహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దోహాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు భారత రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి సమాధానాలు చెప్పారు. ''ఇరు దేశాల రాయబారుల మధ్య ఈ అంశంపై సమావేశం జరిగింది. అందులో ఒక మత ప్రవక్త పట్ల భారత్‌కు చెందిన వ్యక్తులు చేసిన అభ్యంతరకర ట్వీట్లపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ ట్వీట్లు, ఏ రకంగా కూడా భారత ప్రభుత్వ ఆలోచనలను ప్రతిబింబించవు. అవి చెడ్డ వ్యక్తులకు చెందిన ఆలోచనలు. సాంస్కృతిక వారసత్వాన్ని పాటించడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం అనే భావనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలకు సమున్నత గౌరవం ఇస్తుంది. కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నారు'' అని ఆయన అన్నారు.

 
ఒక మతానికి చెందిన ఆరాధనీయ వ్యక్తులను అవమానించడాన్ని ఖండిస్తూ, అన్ని మతాల గౌరవాన్ని నొక్కి చెబుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

 
భారత్-ఖతర్ దేశాల సంబంధాన్ని వ్యతిరేకించే స్వార్థపూరిత వ్యక్తులు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతను దెబ్బతీసే లక్ష్యంతో ఇలాంటి పనులు చేసే వ్యక్తులను వ్యతిరేకంగా మనం కలిసి పనిచేయాలని అని ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ నాయకురాలు, అధికార ప్రతినిధి నూపుర్ శర్మతో పాటు నవీన్ కుమార్ జిందాల్‌ను ఆదివారం పార్టీ నుంచి తొలిగించారు. ఈ చర్య తర్వాత కాంగ్రెస్ స్పందించింది.

 
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఒక మతాన్ని లేదా వర్గాన్ని అవమానించే ఏ భావజాలానికి తాము మద్దతు ఇవ్వబోమని బీజేపీ ఈరోజు చెబుతోంది. కానీ ఇది ఒక సాకు మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది. నష్ట నివారణ ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది ఎలా ఉందంటే... తొమ్మిది వందల ఎలుకలను తిన్న తర్వాత పిల్లి హజ్‌కి వెళ్లినట్లు ఉంది'' అని ఆయన అన్నారు.

 
"బీజేపీ, దాని యోధులు... ఒక మతానికి, వర్గానికి వ్యతిరేకంగా ఇంకో మతాన్ని రెచ్చగొడుతూ, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ వందల ఏళ్లుగా భారత్‌లో ఉన్న వసుదైన కుటుంబం అనే భావనను అవమానించారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మత హింస, ఛాందసవాదం, ద్వేషాన్ని ప్రోత్సహించడంపై ఆధారపడుతోంది. ప్రధానమంత్రి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు రాష్ట్రంలో స్మశాన్- కబ్రిస్తాన్, బుల్డోజర్ వంటి కొత్త విభజన రాజకీయ పదజాలాన్ని తీసుకొచ్చారు. భాజపా తన సంకుచిత రాజకీయ ఎజెండాను కాపాడుకోవడానికి అతి తక్కువ సమయంలోనే దేశాన్ని మతం పేరుతో విభజనలు చేస్తూ దేశాన్ని చీకటి యుగంలోకి నెట్టిందన్నది నిజం. అధికార దాహంతో దేశ రాజకీయాలకు కోలుకోలేని నష్టాన్ని చేస్తోన్న బీజేపీ, దాని నాయకత్వం ఇప్పటికైనా తమ చర్యలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు.
 
'భారత్ క్షమాపణ చెప్పాలి'
మొహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం దోహాలోని భారత రాయబారి దీపక్ మిట్టల్‌కు సమన్లు జారీ చేసింది. ఖతర్ స్పందనకు సంబంధించిన అధికారిక నోట్‌ను అందజేసింది. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై ఖతర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరోవైపు బీజేపీ ఆదివారం నూపుర్ శర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

 
నూపుర్ శర్మపై బీజేపీ తీసుకున్న ఈ చర్యను ఖతర్ స్వాగతించింది. నుపుర్ వ్యాఖ్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ఆగ్రహావేశాలు నెలకొన్నాయని పేర్కొంది. ''నూపుర్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తక్షణమే ఖండించి, అందుకు క్షమాపణలు కూడా చెబుతుందని ఆశిస్తున్నాం'' అని ఖతర్ వ్యాఖ్యానించింది.

 
నూపుర్ శర్మపై పార్టీ వేటు
మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యల వివాదం... భారత్, పాకిస్తాన్‌లతో పాటు సౌదీ అరేబియాకు కూడా పాకింది. ఈ వివాదం ముదురుతుండటంతో బీజేపీ తమ నేతలిద్దరిపై చర్యలు తీసుకుంది. నూపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి తొలిగిస్తునట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని ముస్లిం సమాజం దీన్ని మొహమ్మద్ ప్రవక్తపై దాడిగా భావించింది. అక్కడి వేలాది మంది ప్రజలు, సోషల్ మీడియాలో తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ సామాజిక మాధ్యమాల్లో #Stopinsulting_ProphetMuhammad అనే హ్యాష్‌ట్యాగ్ మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. భారతీయ వస్తువులను బహిష్కరించాలంటూ అరబ్ ప్రజలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

 
బీజేపీ ప్రకటన
బీజేపీ ఆదివారం మధ్యాహ్నం ఈ విషయంపై స్పందించింది. అన్ని మతాలను బీజేపీ గౌరవిస్తుందని, ఒక మతానికి చెందిన గొప్ప వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ... ఏదైనా మతాన్ని లేదా వర్గాన్ని అవమానించే భావజాలానికి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.... ''వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారత్‌లో అనేక మతాలు అభివృద్ధి చెందాయి. బీజేపీ, ప్రతీ మతాన్ని గౌరవిస్తుంది. భారత రాజ్యాంగం పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ఇచ్చింది'' అని అరుణ్ సింగ్ వ్యాఖ్యనించారు.

 
అయితే నూపుర్ శర్మ వ్యాఖ్యల వల్ల చెలరేగిన వివాదం గురించి బీజేపీ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, కాసేపటికి నూపుర్ శర్మతోపాటు నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బీజేపీ సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థలు పీటీఐ, ఏఎన్‌ తెలిపాయి. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత నూపుర్ శర్మ ట్వీట్ చేశారు. ''గత కొన్ని రోజులుగా నేను చాలా టీవీ చర్చల్లో పాల్గొన్నా. ఆ చర్చల్లో ఎప్పుడూ మహాదేవ్‌ను అవమానించారు. అగౌరవపరిచారు. అది శివలింగం కాదు, ఫౌంటెన్ అని అపహాస్యం చేశారు. శివలింగాన్ని రోడ్లపై ఉండే సంకేతాలు, స్థంభాలతో పోల్చుతూ అవమానించారు. ప్రతీసారి మహాదేవ్‌ను అవమానించడం, అగౌరవపరచడం తట్టుకోలేక సమాధానంగా ఏదో అన్నాను. నా మాటలు ఎవరినైనా నొప్పించినా లేదా మత మనోభావాలను దెబ్బతీసినా... బేషరతుగా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. ఎవరి మత మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు'' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

 
అరెస్ట్ చేయాలని డిమాండ్
నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ ముస్లిం సామాజిక సంస్థ రజా అకాడమీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మే 28న #ArrestNupurSharma పేరుతో హ్యాష్ ట్యాగ్‌ని షేర్ చేస్తూ... ఈ ట్యాగ్ ద్వారా ప్రజలంతా తమ నిరసనను తెలపాలని కోరింది. దీంతో పాటు ముంబైలో నుపుర్ శర్మపై ఐపీసీ సెక్షన్ 153ఎ, 295ఎ, 505(2) కింద రజా అకాడమీ కేసు నమోదు చేసింది. ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని రజా అకాడమీ ధ్రువీకరించింది. ''దైవ దూషణ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ముంబై పోలీస్ కమిషనర్‌కు రజా అకాడమీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ వెంటనే ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు'' అని ట్వీట్‌లో పేర్కొంది. ఇదే కాకుండా, నూపుర్ శర్మపై మహారాష్ట్రలోని అంబాజోగై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు టిప్పు సుల్తాన్ పార్టీ ట్వీట్ ద్వారా తెలిపింది. పాకిస్తాన్‌ ప్రజలు కూడా నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ #ArrestNupurSharma హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

 
'చంపేస్తామని బెదిరిస్తున్నారు'- నూపుర్ శర్మ
తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని నూపుర్ శర్మ అన్నారు. దీని తర్వాత తన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ''నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని, తలలు నరికేస్తామని నిరంతరం బెదిరింపులు వస్తున్నాయి. ఇదంతా మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడానికి, నకిలీ కథనాన్ని సృష్టించడానికి, ఘర్షణ వాతావరణాన్ని కల్పించడానికి @zoo_bear (మొహమ్మద్ జుబైర్ ట్విటర్ ఖాతా) చేసిన ప్రయత్నాల కారణంగా జరిగింది. కొన్ని చిత్రాలను ఇక్కడ జత చేస్తున్నా. దయచేసి గమనించండి'' అంటూ ఆమె ట్వీట్ చేశారు.

 
వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ నూపుర్ శర్మ... "తనను తాను ఫ్యాక్ట్ చెకర్‌గా చెప్పుకునే మొహమ్మద్ జుబైర్, నా టీవీ చర్చల్లో ఒక వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం ద్వారా నాపై వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారు. అప్పటినుంచి నా కుటుంబ సభ్యులను, నన్ను చంపుతామని అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి'' అని చెప్పారు.

 
నూపుర్ శర్మ ఎవరు?
నూపుర్ శర్మ, బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. కానీ, భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. దిల్లీ బీజేపీ కార్యవర్గ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చాలో కూడా ఆమె ప్రముఖంగా ఉన్నారు. 1985 ఏప్రిల్ 23న నూపుర్ శర్మ జన్మించారు. దిల్లీలోని మథురా రోడ్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. హిందూ కాలేజీ (దిల్లీ)లో ఎకానమిక్ ఆనర్స్‌లో డిగ్రీ చదివారు. 2010లో లా-ఫ్యాకల్టీ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశారు.

 
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిన్స్ నుంచి ఎల్ఎల్ఎం చదివారు. కాలేజీ రోజుల నుంచి నుపుర్ శర్మ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టిక్కెట్‌పై పోటీ చేసిన ఆమె... దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) అధ్యక్షురాలు అయ్యారు. తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బీజేపీలో ఉంటూ ఇప్పటి వరకు అనేక పదవులు చేపట్టారు.