గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:55 IST)

ఏపీలో పరిషత్ ఎన్నికలు యథాతథం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది.

 
అసలు ఏం జరిగింది
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించలేదంటూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ నిన్న పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. దీనిపై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఎస్‍ఈసీ తరఫున న్యాయవాది సి.వి.మోహన్‍రెడ్డి వాదనలు వినిపించారు.

 
28 రోజుల కోడ్ ఉండాలనేది సుప్రీంకోర్టు ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని, ఈ ఎన్నికలకు కోడ్ నిబంధన వర్తింపచేయాల్సిన అవసరం లేదని ఎస్‍ఈసీ వాదించింది. రిట్ పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, టీడీపీ తరఫున పిటిషన్ వేయలేదని ఎస్‍ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్‌కి కనీసం, గరిష్ట ఎన్నికల కోడ్ నిబంధన లేదన్న ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు అంగీకరించింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 
ఫలితాలు నిలిపివేత
తదుపరి విచారణను కోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడి ఎన్నికల నిర్వహణ జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 15 తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 513 జడ్పీటీసీ, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జెడ్పీటీసీ బరిలో 2092 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో 19002 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 33,636 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.