సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: గురువారం, 2 మే 2019 (22:03 IST)

తింటే సుబ్బయ్య హోటల్లోనే తినాలి... 34 రకాల పదార్థాలతో కొసరికొసరి వడ్డిస్తూ...

తింటే గారెలు తినాలి… వింటే భారతం వినాలి! అనే నానుడి తెలుగునాట విశేష ప్రాచుర్యం పొందింది. గోదావరి జిల్లాల్లో దాదాపు అదే స్థాయిలో 'తింటే సుబ్బయ్య భోజనమే తినాలి...' అనేంత పాపులారిటీ ఈ హోటల్‌ది.

గుంటూరు నుంచి కాకినాడ వెళ్లి స్థిరపడిన సుబ్బయ్య చేతి వంట రుచికి కాకినాడ వాసుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఇప్పుడు హైదరాబాద్ వరకూ విస్తరించింది. 1950లో కాకినాడకి వలస వెళ్లిన గునుపూడి సుబ్బయ్య వివిధ కార్యక్రమాల్లో వంట మేస్త్రిగా పనిచేసేవారు. ఐదేళ్ల పాటు అదే రీతిలో జీవనం సాగించిన తర్వాత 1955లో కలెక్టర్ కార్యాలయానికి వెనక వీధిలో హోటల్ ప్రారంభించారు.
 
హోటల్ లేని రోజుల నుంచే...
అప్పట్లో పూట కూళ్ళమ్మ విధానం తప్ప హోటల్‌లో తినడం పెద్దగా అలవాటు లేదు. అయినా సుబ్బయ్య నిరాశ చెందకుండా తన చేతి వంట రుచి చూసిన వాళ్ళు అందించే ప్రోత్సాహంతో హోటల్ కొనసాగించారు. చివరకు ఆ హోటల్‌కి పేరు కూడా పెట్టకుండానే సుబ్బయ్య హోటల్‌గా కీర్తి గడిచింది. సుబ్బయ్య హోటల్ 64 ఏళ్లుగా కొనసాగుతోంది. సుబ్బయ్య తర్వాత రెండు తరాల వారు కూడా ఇదే హోటల్ వ్యాపారం సాగిస్తున్నారు. మరింతగా విస్తరిస్తున్నారు. నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. కాకినాడలోనే సుబ్బయ్య హోటల్ పేరుతో మూడు హోటళ్లు పక్కపక్కనే నడుపుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుబ్బయ్య మరణం తర్వాత ఇలాంటి మార్పులు వచ్చినట్టు చెబుతున్నారు.
 
ఆప్యాయంగా వడ్డించడమే మా విధానం
ఒకనాడు సుబ్బయ్య ప్రారంభించిన పంథాలో, అదే భవనంలో నేటికీ పాత హోటల్ మాత్రం కొనసాగిస్తుండడం విశేషం. ఇటీవల ప్రారంభించిన హైదరాబాద్ బ్రాంచ్‌కి కూడా మంచి ఆదరణ లభిస్తోందని గునుపూడి శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. ప్రతి కస్టమర్ పక్కనా ఓ వ్యక్తి నిలబడి కొసరి కొసరి బలవంతంగా వడ్డించి, కడుపు నిండా కాదు, అంతకన్నా ఎక్కువగానే తినేవరకూ వదిలిపెట్టరు. అదే ఈ హోటల్ ప్రత్యేకత.
 
"హోటల్‌కి వస్తున్న కస్టమర్లకు ఆప్యాయంగా కొసరి కొసరి భోజనం వడ్డించడం మా ప్రత్యేకత, మా సక్సెస్‌కి అది కూడా ఓ కారణం. ఎంతో ఆకలితో వచ్చిన వారికి దగ్గరుండి అడిగి మరీ వడ్డించాలని చెబుతాం. తరం మారుతున్నా.. మా భోజనం క్వాలిటీలో రాజీ పడకుండా అందిస్తున్నాం. ముఖ్యంగా అరటి ఆకులో ఇంటి భోజనం తిన్నామనే భావన అందరికీ కలగాలని ఆశిస్తున్నాం" అని ఆయన వివరించారు.
 
అన్నం పది రకాలుగా..!
సహజంగా చాలా హోటళ్లలో అన్నం వడ్డిస్తారు. కొందరు పులిహోర, ఇంకొందరు పలావు జోడిస్తారు. కానీ సుబ్బయ్య హోటల్లో మాత్రం కేవలం అన్నమే పది రూపాల్లో అందిస్తారు. టొమాటో రైస్, పన్నీర్ రైస్, జీరా రైస్ అంటూ యంగ్ జనరేషన్ రుచులను అందిస్తూనే ఆవకాయ అన్నం, పాలతో పరమాన్నం కూడా వడ్డిస్తారు. పచ్చళ్ళు, పొడులు కలుపుకుని మొత్తంగా 34 రకాల ఐటమ్స్ అరిటాకులో వడ్డించేసరికి వాటిని చూస్తేనే కడుపు నిండుతుందా అన్నట్లు ఉంటాయి.
 
'సుబ్బయ్య భోజనం కోసమే వచ్చాం'
కాకినాడ వచ్చిన ఇతర ప్రాంతాల వారు కూడా సుబ్బయ్య హోటల్ భోజనానికి ప్రాధాన్యం ఇస్తారు. కొందరు పనిగట్టుకుని మరీ ఆ హోటల్‌కు వెళ్లి వస్తుంటారు. అలా వచ్చిన తణుకు పట్టణానికి చెందిన రాధాదేవిని బీబీసీ పలకరించింది. "పెద్దాపురం సమీపంలోని దేవస్థానానికి దర్శనం కోసం వచ్చాం. అక్కడి నుంచి వెనక్కి వెళ్లొచ్చు. కానీ సుబ్బయ్య హోటల్ భోజనం కోసం కాకినాడ వచ్చాం. భోజనం కడుపునిండుగా తినొచ్చు. రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తున్నాం" అని చెప్పారామె.
 
ప్రస్తుతం సుబ్బయ్య హోటల్‌కు కేటరింగ్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. కాకినాడ నుంచి ఒకవైపు ఏలూరు, మరోవైపు విశాఖపట్నం దాటి కూడా కేటరింగ్ అందిస్తున్నారు. దానిలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఆర్డర్లు ఎక్కువగా వస్తుండడంతో కొన్నిసార్లు సరఫరా చేయలేని స్థితి కూడా ఉంటోందని శ్రీనివాసరావు అన్నారు. మొత్తానికి సుబ్బయ్య హోటల్ రుచులు ఇప్పుడు గోదావరి జిల్లాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావడం విశేషమే అంటున్నారు భోజనప్రియులు.
 
వి.శంకర్
బీబీసీ కోసం