గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:58 IST)

ఆముదాన్ని తలకు పట్టించి ఆపై ఇలా చేస్తే..?

జుట్టు చివర్ల చిట్లిపోతే వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. తెగిన శిరోజాలతో తలకట్టు కూడా సరిగ్గా కుదరదు. మరి పట్టుకుచ్చులా ఉండే కురులు సొంతం చేసుకోవాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
 
కొబ్బరి, ఆలివ్ నూనెను తీసుకుని వేడిచేయాలి. గోరువెచ్చగా అయిన తరువాత నూనెను కుదుళ్ల నుండి చివర్ల వరకూ తలకు రాసుకోవాలి. దాంతోపాటు మాడుకు చక్కగా మర్దన చేసి మర్నాడు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. అలానే రెండు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరించేస్తుండాలి.
 
బొప్పాయిని తీసుకుని దానిలోని గింజలను తొలగించాలి. వాటిని మెత్తగా చేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన కురులు చిట్లే సమస్య నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలే సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. 
 
నెలకోసారి కొబ్బరి పాలలో శిరోజాలను తడిపి గంటసేపు తరువాత షాంపుతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకుని జుట్టు చివర్లకు రాసుకోవాలి. పొడి తువాలను తలకు చుట్టి అరగంట తరువాత స్నానం చేస్తే సరిపోతుంది. కురులు కూడా ఒత్తుగా పెరుగుతాయి.