ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 6 మే 2019 (19:30 IST)

వేసవిలో జిడ్డు చర్మం... ప్రకాశవంతంగా వుండేందుకు ఇలా...

సాధారణంగా వేసవికాలంలో ఎండలకు బాగా చెమటలు పట్టడం వలన చాలా చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం కలవారైతే ఎక్కువగా ఇబ్బందిపడుతుంటారు. కొద్దిగా చెమటపట్టగానే ముఖమంతా జిడ్డుగా మారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి రకరకాల క్రీంలు, కాస్మోటిక్స్ వాడుతుంటారు. వీటివలన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా మనకు సహజసిద్దంగా లభించే కొన్ని పదార్దాలతోనే మనం ఈ జిడ్డు సమస్యని తొలగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. పాలలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాతచల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం తెల్లగా, తాజాగా,అందంగా తయారవుతుంది. ఈ పాలలో ఉన్న బ్యాక్టీరియాలు ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.
 
2. నిమ్మలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వలన దీనిలో ఉన్న యాంటీఏజింగ్ గుణాలు పిహెచ్ లెవల్ ను పెంచుతాయి. జిడ్డుచర్మం ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
3. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి.ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండు సార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
4. నిమ్మతొక్కల్ని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి ఉంచుకుని, అవసరమైనప్పుడు ఈ పొడిలో తగినన్ని పాలు కలిపి ముఖానికి పట్టించి గంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
5. టమోటా రసంతో ముఖం కడుగుకొనుట వలన ముఖంపై ఉన్నజిడ్డు తొలగిపోయి ముఖం తెల్లగా, మెరుస్తూ ఉంటుంది. ఇది మంచి  సౌందర్య లేపనంగా పనిచేస్తుంది.