వేసవిలో మజ్జిగతో అందం, ఆరోగ్యం
సాధారణంగా ఎండాకాలంలో మన శరీరంలోని వేడితత్త్వాన్ని తగ్గించుకోవడానికి మజ్జిగను ఎక్కువగా తాగుతుంటాము. చిక్కగా ఉన్న మజ్జిగ కన్నా నీరు ఎక్కువగా వేసుకుని మజ్జిగ చేసుకుని తాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మజ్జిగ మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అద్బుతంగా సహాయం చేస్తుంది. అదెలాగో చూద్దాం.
1. ఎండల్లో ఎక్కువగా తిరగడం వలన సున్నితమైన చర్మం కమిలినట్లు అయిపోతుంది. ఈ సమస్యను తగ్గించాలనుకుంటే.... రెండు పెద్ద చెంచాల మజ్జిగలో చెంచా టొమాటో గుజ్జు కలిపి ముఖానికి మర్దనా చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
2. చర్మం తాజాగా ఆరోగ్యంగా కనిపించాలంటే రెండు పెద్ద చెంచాల మజ్జిగలో ఒకటిన్నర చెంచా ఓట్ మీల్ పొడి కలపాలి. దీనిని వారానికి ఒకసారి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.
3. ముఖానికి రకరకాల క్రీమ్స్, పౌడర్లు వాడడం వల్ల చర్మంపై మురికి, జిడ్డు పేరుకుంటాయి. వాటిని పూర్తిగా తొలగించేందుకు మజ్జిగ ఎంతగానో సహాయపడుతుంది. అదెలాగంటే.... మూడు పెద్ద చెంచాల మజ్జిగలో రెండు చెంచాల మొక్కజొన్నపిండి కలిపి ముద్దలా చేసుకోవాలి. ముఖాన్ని తడి చేసుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని పూతలా రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.
4. మజ్జిగకు చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి పోషణ అందించే గుణం ఉంది. రెండు చెంచాల మజ్జిగలో కొన్ని చుక్కల బాదం నూనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి , మెడకు పూతలా రాసుకోవాలి. ఇది బాగా ఆరాక చన్నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా ఉంటుంది.