ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? అమేజాన్ కూడా ఫుడ్ డెలివరీ చేస్తోందట..
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని లాగించే వారికి ఓ గుడ్ న్యూస్. ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ ప్రస్తుతం ఫుడ్ డెలివరీ సేవల రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత బెంగళూరులో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. స్థానిక రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నామని అమేజాన్ తెలిపింది.
వినియోగదారుల కోరిక మేరకు వారికి షాపింగ్ అనుభవంతో పాటు, ఫుడ్ డెలివరీని కూడా ఇవ్వాలనుకుంటున్నట్లు అమేజాన్ తెలిపింది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై వుంటున్న ప్రస్తుత కాలంలో అమేజాన్ ఫుడ్ డెలివరీ సేవల్లో భాగం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
అలాగే సేఫ్టీ, పరిశుభ్రతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని అమేజాన్ అధికారిక ప్రతినిధి తెలిపారు. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి, అత్యున్నత ప్రమాణాలతో తాము ఫుడ్ డెలివరీ చేస్తామని, ఇందుకోసం 'హైజీన్ సర్టిఫికేషన్ బార్' ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం బెంగుళూరుకు పరిమితమైన తమ సేవలు క్రమంగా అన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు.