శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 5 మే 2020 (13:03 IST)

కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?

ప్రపంచంలోని ఒక పెద్ద భాగం లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి ఉంది. వినియోగదారులు ఖర్చు చేయడం లేదు, చాలా పరిశ్రమలు దివాలా అంచులకు చేరుకున్నాయి. కానీ టెక్నాలజీ రంగంలో కొన్ని పెద్ద కంపెనీలపై మాత్రం ఈ విశ్వ మహమ్మారి ప్రభావం చాలా మామూలుగా ఉంది. సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత ఈ టెక్నాలజీ సంస్థలు ఇంతకు ముందు కంటే ఎంతో బలంగా ఆవిర్భవిస్తాయని ఇప్పుడు భావిస్తున్నారు.

 
కొన్ని రోజుల క్రితం గూగుల్‌ సంస్థ ‘ఆల్ఫాబెట్’, ‘యాపిల్’, ‘ఫేస్‌బుక్’, ‘అమెజాన్’ ఫలితాలను వెల్లడించాయి. GAFA (గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, అమెజాన్) గ్రూప్ పేరుతో ప్రముఖమైన ఈ కంపెనీలు ప్రమాదకర స్థాయిలో బలోపేతం అయ్యాయని, వాటిని కత్తిరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

 
గూగుల్, ఫేస్‌బుక్
గూగుల్, ఫేస్‌బుక్ రెండూ పూర్తిగా ప్రకటనల వల్ల వచ్చే ఆదాయంపైనే ఆధారపడతాయి. ప్రకటనలు ఇచ్చే కంపెనీలన్నీ తమ మార్కెటింగ్ బడ్జెట్లో కోత పెట్టుకుంటుంటే, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతాయని మీరు అనుకోవచ్చు. ప్రకటనల వల్ల వచ్చే ఆదాయంలో హఠాత్తుగా చాలా పెద్ద పతనం నమోదైందని మార్చి నెలలో అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు.

 
కానీ, ఆ కంపెనీ షేర్ల ధరల్లో చాలా వృద్ధి కనిపించింది. దానిని చూస్తుంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ మెరుగుపడడం మొదలైనట్లు అనిపిస్తోంది. కరోనావైరస్ వల్ల తమ ప్రకటనల వ్యాపారంపై కాస్త ప్రభావం పడిందని ఫేస్‌బుక్ కూడా చెప్పింది. వార్తాపత్రికలు, టీవీ చానళ్ల వ్యాపారం కూడా క్లిష్ట స్థితికి చేరుకుంది.

 
యాపిల్, అమెజాన్
యాపిల్ కంపెనీ హార్డ్‌‌వేర్ బిజినెస్ అంటే, ఫోన్ల అమ్మకాల్లో పతనం నమోదైంది. కానీ కంపెనీకి సర్వీస్ వల్ల వచ్చే సంపాదనలో వృద్ధి కనిపించింది. ఆన్‌లైన్ రీటెయిల్ బిజినెస్‌లో తిరుగులేని అమెజాన్ వ్యాపారం వేగంగా పెరుగుతోంది. దాని క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. అయితే, కరోనావైరస్‌ను ఎదుర్కోడానికి కంపెనీ ఖర్చులు మాత్రం కచ్చితంగా పెరిగాయి.

 
దీనివల్ల పెట్టుబడిదారులను నోరెత్తకండని జెఫ్ బెజోస్ హెచ్చరించాల్సి వచ్చింది. తమకు లాభాలు మాత్రమే అన్నీ కాదని చెప్పడానికి అది ఒక సంకేతం. “అభివృద్ధి చెందడానికి ఖర్చు చెయ్, ఖర్చు చేస్తూనే ఉండు” అనే విధానం ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా మార్చింది. జెఫ్ బెజోస్, ఆయన కంపెనీ కరోనా సంక్షోభం తర్వాత ఇంతకు ముందు కంటే మరింత బలోపేతమై ముందుకు వస్తాయనడానికి అది సంకేతం.

 
కఠిన నిబంధనల అమలుకు డిమాండ్
మరోవైపు, “ఈ వారం మా కంపెనీ రెండేళ్లకు సమానమైన సంపూర్ణ మార్పు రెండు నెలల్లోనే సాధించింది” అని దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. ఆ కంపెనీ ఫలితాలు బాగున్నాయనేది ఇక్కడ సుస్పష్టం. “విప్లవాత్మక అభివృద్ధి అనే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తే, దానివల్ల కంపెనీ సామర్థ్యం మరింత పెరుగుతుంది” అన్నారు నాదెళ్ల.

 
కానీ ఈ కంపెనీల వేగవంతమైన వృద్ధి వీటిని ఇప్పటికే చాలా బలమైనవిగా మార్చేసింది. ఈ కంపెనీలపై కఠిన నియమ నిబంధనలు అమలు చేయాలనే డిమాండును బలంగా సమర్థించే వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆర్థిక సలహాదారు జాసన్ ఫర్‌మెన్ ఒకరు. కరోనావైరస్ సంక్షోభం వల్ల ఈ కంపెనీలపై ఒత్తిడి తగ్గిపోతుందని జాసన్ ఫర్‌మెన్ అనుకుంటున్నారు.

 
అమెరికా షేర్ మార్కెట్
“పరిస్థితులు ఇలాగే ఉంటే, ఈ కంపెనీలు తమ బలమైన స్థితిని మరింత బలోపేతం చేసుకునే దిశగా వెళ్తాయి. లేదా కరోనావైరస్ సంక్షోభం వల్ల వాటిపై అమలవుతున్న నియమ నిబంధనల్లో కాస్త సడలింపు ఇచ్చినా, అవి ఏదో ఒక సమయంలో మనకు ఆర్థిక ఇబ్బందులు సృష్టించవచ్చు” అని జాసన్ ఫర్‌మెన్ అంటున్నారు.

 
ఈ వారం అమెరికా, యూరప్‌లో అలాంటి భయపెట్టే గణాంకాలే విడుదల అయ్యాయి. అమెరికా షేర్ మార్కెట్లు మెరుగుపడ్డం కనిపించింది. గత మూడు దశాబ్దాల్లో ఏప్రిల్ నెల అత్యంత మెరుగ్గా ఉంది. దీనికంతటికీ కారణం టెక్నాలజీ బిజినెస్‌కు అనుసంధానమై ఉన్న ఈ కంపెనీలే. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ షేర్లలో మార్చి 15 తర్వాత 40 శాతం వృద్ధి నమోదైంది.

 
అధ్యక్షుడు ట్రంప్ తన ఎజెండాలో భాగంగా ‘డౌ జోన్స్ ఇండెక్స్’ మీద చాలా దృష్టి పెట్టారు. కానీ ఈ టెక్ సంస్థలు ఇలాగే అభివృద్ధి చెందుతుంటే, వాటిపై చర్యలు తీసుకోవడంపై ట్రంప్ ప్రభుత్వం అంత ఆసక్తి చూపకపోవచ్చు.