గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (13:13 IST)

రూ.2 వేల నోటు రద్దు?. కేంద్రం వివరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును రద్దు చేయబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఇదే అంశంపై విత్తమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టంచేశారు. 
 
తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది. దాదాపు నెల రోజుల పాటు సామాన్యులు కూడా నోట్లు మార్చుకునేందుకు నానాపాట్లు పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం వెయ్యి నోటును పూర్తిగా ఎత్తేసి రూ.2 వేల నోటును చలామణిలోకి తెచ్చింది.
 
అయితే ఇటీవలకాలంలో 2 వేల నోటు మార్కెట్‌లో కంటికి కనిపించడం లేదు. దీంతో ఈ నోటును రద్దు చేస్తున్నారనే పుకార్లు హల్చచల్ చేస్తున్నాయి. రూ.2 వేల నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని, అందువల్ల రిజర్వ్‌బ్యాంక్‌కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఈ పుకార్లపై విత్తమంత్రి స్పందించారు. ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏమీ చేయడం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రూ.2 వేల నోటు రద్దుపై అసత్య ప్రచారం సాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.