శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (16:33 IST)

డాలర్ల కేసు పునర్విచారణ : తితిదేలో కలకలం

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో కుదిపివేసిన 300 బంగారు డాలర్ల దుర్వినియోగం కేసును మరోసారి విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తితిదే డాలర్ల కేసును విచారణ నిమిత్తం విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సత్యనారాయణను నియమిస్తూ జీఓ కూడా జారీచేశారు. మూడునెలల్లో విచారించి నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
అసలు కథ ఇదీ.. : 
తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే ఆధ్వర్యంలో బంగారు, వెండి, ఇతర లోహాలతో శ్రీవారు, లక్ష్మీదేవీతో కూడిన డాలర్లను విక్రయిస్తుంటారు. దీనికి సంబంధించిన కౌంటర్‌ను 2006లో అసిస్టెంట్‌ షరాబు కె.వెంకటాచలపతి నిర్వహించేవారు. ఐదు గ్రాముల బరువైన 300 బంగారు డాలర్లు ఆ సమయంలో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీనిపై అప్పట్లోనే ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. 
 
ప్రధాన నిందితుడిగా ఉన్న కౌంటర్‌ నిర్వాహకుడైన వెంకటాచలపతిని తితిదే 2006లో సస్పెండ్‌ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ఉద్యోగిని చనిపోయారు. ప్రస్తుత ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈఓలు ప్రభాకర్‌ రెడ్డి, వాసుదేవ్‌‌లు కూడా విచారణ ఎదుర్కున్నారు. విచారణ కమిటి వీరికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మిగిలిన వారిలో కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేయగా, కొందరు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. 
 
ఆ తర్వాత ఈ కేసులో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అసిస్టెంట్‌ షరాబుతో పాటు 17 మందిపై విచారించాలంటూ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. పుష్కరకాలం నాటి కేసును తిరిగి తోడాలని ప్రభుత్వం భావించడం దేవస్థానం వర్గాల్లో కలకలం రేపుతోంది.