విమానాల్లో బీఎస్ఎన్ఎల్ హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు
విమానాల్లోని ప్రయాణికులకు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమైంది. అవసరమైన అనుమతులను టెలికాం విభాగం నుంచి తాజాగా పొందింది. ఇండియాలో గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుమతులు దక్కాయని బ్రిటిష్ శాటిలైట్ సంస్థ ఇన్‌మార్‌శాట్ వెల్లడించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ పొందిన ఇన్‌ఫ్లయిట్, మారిటైమ్ కనెక్టివిటీ లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయానానికి చెందిన కస్టమర్లకు జీఎక్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మార్‌శాట్ ప్రతినిధులు తెలిపారు.
జీఎక్స్ సేవలకు సంబంధించి ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇన్‌మార్‌శాట్. బీఎస్‌ఎన్‌ఎల్ పొందిన లైసెన్సులతో మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు వేగంగా నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు.
కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో వీటిని మొదలు పెడతాం అని స్పైస్‌జెట్ ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. ప్యాసింజర్ ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీ సేవల్లో అంతర్జాతీయంగా పేరొందిన జీఎక్స్ సేవలు మన దేశానికి విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.