ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (13:43 IST)

ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు : సీఈవో భవీశ్ అగర్వాల్

ola ev car
ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. పంద్రాగస్టు రోజున ఈ శుభవార్త వెల్లడించింది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఎలక్ట్రిక్ కారును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కారు ఒక్కసారికి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కారును 2024లోకి అందుబాటులోకి తీసుకొస్తామని ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. 
 
కేవలం నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారును తీర్చదిద్దనున్నట్టు తెలిపారు. పెట్రోలు, డీజిల్ రేట్లు సామాన్యులు మోయలేనంతగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్ బాగా పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో అనూహ్యంగా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించింది. ఆగస్టు 15న కీలక ప్రకటన చేయబోతున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసినప్పుడే.. అది ఎలక్ట్రిక్ కారు అయి ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఊహించినట్టుగానే ఓలా ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
 
తమిళనాడులోని పోచంపల్లిలో వంద ఎకరాల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్, 200 ఎకరాల్లో ఈవీ కారు ప్లాంట్, 40 ఎకరాల్లో ఈవీ స్కూటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు భవీశ్ తెలిపారు. ఏడాదికి 10 లక్షల విద్యుత్ కార్లు, కోటి ఈవీ బైక్‌లు, 100 గిగావాట్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.